వనపర్తి

తెలంగాణ, వనపర్తి జిల్లా, వనపర్తి మండలం లోని పట్టణం

వనపర్తి, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా, వనపర్తి మండలానికి చెందిన పట్టణం,[1] జిల్లా పరిపాలన కేంద్రం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 1959, అక్టోబరు 11న రాష్ట్రంలోనే మొదటి పాలిటెక్నిక్‌ కళాశాల ఈ పట్టణంలోనే ప్రారంభించబడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 149 కి.మీ.ల దూరంలో ఉంది.

వనపర్తి
—  రెవెన్యూ గ్రామం  —
వనపర్తి రాజ భవనం
వనపర్తి రాజ భవనం
వనపర్తి రాజ భవనం
వనపర్తి is located in తెలంగాణ
వనపర్తి
వనపర్తి
అక్షాంశరేఖాంశాలు: 16°21′29″N 78°03′44″E / 16.357943°N 78.062239°E / 16.357943; 78.062239
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండలంవనపర్తి
ప్రభుత్వం
 - మున్సిపాలిటీ
పిన్ కోడ్ 509103
వెబ్‌సైటు: www.wanaparthymunicipality.in

భౌగోళిక స్థితి

వనపర్తి జిల్లా కేంద్ర స్థానమైన వనపర్తి పట్టణం భౌగోళికంగా జిల్లా మధ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నైరుతి వైపున 149 కిలోమీటర్ల దూరంలో 16°36" ఉత్తర అక్షాంశం, 78°06" తూర్పు రేఖాంశంపై ఉంది. చుట్టూ కొండలు, గుట్టలచే ఆవరించబడిన ఈ పట్టణానికి రవాణా పరంగా రోడ్డు, దగ్గరలో మదనాపురం రైల్వే స్టేషను  మార్గాన మంచి వసతులున్నాయి. వ్యవసాయకంగా, పారిశ్రామికంగా ఈ పట్టణం అంతగా అభివృద్ధి చెందలేదు.

గణాంక వివరాలు

2019 జనాభా లెక్కల ప్రకారము ఈ పట్టణ జనాభా మొత్తం జనాభా 101500 కాగా అందులో పురుషులు 51000, స్త్రీలు 50500

రవాణా సదుపాయాలు

  • ఉమ్మడి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలోనే తొలిసారిగా ఏర్పాటైన బస్సు డీపో వనపర్తిలో ఉంది. వనపర్తి సంస్థానాధీశుల కోరిక మేరకు నిజాం ప్రభుత్వం ఇక్కడ బస్సు డీపోను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముంబైకి బస్సు రవాణా కలిగియున్న మొదటి జిల్లా వనపర్తి. ఈ పట్టణం జాతీయ రహదారి నెం.44 (పాత నెం.7)కు కేవలం 14 కి.మీ దూరంలో ఉంది.
  • ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వే స్టేషను లేదు. దగ్గరలో మదనాపురం రైల్వే స్టేషను వరకు పోవడానికి బస్సు సౌకర్యం ఉంది.
  • వనపర్తి పట్టణములో వాయు రవాణా సదుపాయము లేదు. సమీపంలోని విమానాశ్రయము శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము.ఇది పట్టణానికి 134 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వనపర్తి సంస్థానాధీశుల చరిత్ర

గరుడ పుష్కరిణి

నిజాం పరిపాలనలో వనపర్తి సంస్థానం ప్రముఖ స్థానం ఆక్రమించింది. వనపర్తి సంస్థానం వైశాల్యం 450 చ.మై.తో 124 గ్రామాలతో కొనసాగింది. ఈ సంస్థానానికి పెబ్బేరు మండలంలోని సూగూరును తొలి రాజధానిగా పరిపాలన కొనసాగించారు. ప్రారంభంలో సూగూరు సంస్థానంగా వ్యవహరించబడింది. సంస్థానాన్ని పరిపాలించిన మొదటి రామకృష్ణారావు సూగూరు నుంచి తన రాజధానిని వనపర్తికి మార్చడం వలన వనపర్తిని సంస్థానంగా పరిగణించారు. ఈ సంస్థానాధీశుల ఇంటిపేరు జనుంపల్లి. ఈ వంశానికి మూలపురుషుడు వీరకృష్ణ భూపతి, వీరిని వీర కృష్ణారెడ్డి అని కూడా సంబోధించేవారు. వనపర్తి సంస్థానాదీశుల తొలి నివాసం కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా జనుంపల్లి గ్రామం. జనుంపల్లి నుంచి పానుగల్ పరిధి ఉన్న పాతపల్లి గ్రామానికి వలస వచ్చి సూగూరు సంస్థానాధీశులుగా వ్యవహరించారని చరిత్ర చెబుతుంది.

వీర కృష్ణ భూపతికి నాలుగవ తరం వారసుడు వేముడి వెంకటరెడ్డి. ఇతడు యుద్దవిధ్యలలో ఆరితేరినవాడిగా చెబుతారు. గోలుకొండ సైన్యం దండెత్తిన సమయంలో వేముడి వెంకట్ రెడ్డి 10,000 సైన్యంతో వెళ్ళి యుద్ధం చేసారు. సూగూరు సంస్థానానికి అనుభందంగా మరికొన్ని గ్రామాలను ఖుతుబ్ షా నుండి పొందినట్లు తెలుస్తుంది. వెంకట్ రెడ్డి కుమారుడు గోపాల రాయలు వనపర్తి సంస్థానాదీశులలో 'బహిరి' అనే బిరుదును పొందినట్లు తెలుస్తుంది. సా.శ. 1637లో గోపాలరాయుడు దివంగతుడైనట్లు తెలుస్తుంది. గోపాల రాయలుకు మగ సంతతి లేనందున సవాయి వెంకట రెడ్డిని దత్తత తీసుకున్నారు. సంస్థాన ఆదాయం సరిపోక రుణాలు చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. నిజాంకు చెల్లించాల్సిన కప్పాన్ని చెల్లించనందున ఇతడు నిజాం సైన్యంతో పోరాడి అపజయం పొంది సా.శ. 1711లో ఆత్మహత్య చేసుకున్నట్లు చరిత్ర చెబుతుంది.

వనపర్తి సంస్థానం ఏలిన వారిలో మొదటి రామకృష్ణా రావు దాయాదుల కుట్రతో నిజాం ప్రభువు చెరసాలలో మూడు సం.లు గడిపాడు. చివరకు నిజాం రామకృష్ణా రావుకు విముక్తి కలిగించారు. నిజాం నుండి సా.శ. 1817లో రాజా బహద్దూర్ బిరుదును బహూకరించారు. రామకృష్ణా రావు దత్త పుత్రుడు మొదతి రామేశ్వర్ రావు గద్వాల సంస్థాన పాలన బాధ్యతలు స్వీకరించిన పిదప ప్రజలకు అనేక సదుపాయాలు కల్పించారు. సా.శ.1839లో కాశీయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి విడిసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ గ్రామం అన్ని సామాన్లు దొరికే స్థలంగా, వసతిగా ఉండేదని వ్రాశారు.[3] సా.శ. 1861లో రాజా రామేశ్వర్ రావు సేవలకు గాను కరవాలం, పిస్తోలు, రైఫిలు వంటి ఆయుధాలను బ్రిటిషు వారు, నిజాం ప్రభువులు బహూకరించినట్లు తెలుస్తుంది.

రాజా రామేశ్వర్ రావు దత్త పుత్రుడు రాజా రామకృష్ణ రాయలు అకస్మాత్తుగా మృత్యు వాత పడ్డాడు. రెండవ రామేశ్వర రావు దత్త పుత్రుడుగా వచ్చి పాలన బాధ్యతలను స్వీకరించారు. ఇతడు సమర్థుదుగా, పరిపాలనా దక్షుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ప్రజాహిత కార్యక్రమాలతో పాటు వ్యవసాయ అభివృద్ధికి చెరువులు, కుంటలు, బావులు అనేకం త్రవ్వించారు. రాజా రామేశ్వర్ రావుకు ఇద్దరు కుమారులు శ్రీ కృష్ణ దేవరాయలు, శ్రీ రామ దేవరాయలు. మునగాల సంస్థానాదీశుడగు రాజా నాయని వెంకట రంగారావు బహద్దూర్ కూతురు సరళాదేవిని శ్రీ కృష్ణ దేవరాయలు వివాహం చేసుకున్నారు. పింగళి వెంకట్రామారెడ్డి కూతురు కుముదినీ దేవిని శ్రీ రామ దేవరాయులు వివాహం చేసుకున్నారు. రాణి సరళాదేవి పేరుతో వనపర్తి సంస్థానంలో 'సరళా సాగర్' అనే ప్రాజెక్ట్ ను నిర్మించారు.

రాజా శ్రీ కృష్ణ దేవరాయలు, రాణి సరళా దేవి కుమారుడు రాజా రామేశ్వర్ రావు ఉన్నత విద్యావంతుడు. సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంలోనూ, అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ విలీనం అయిన పిదప రాజా రామేశ్వర రావు పార్లమెంటు సభ్యునిగా కొనసాగారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖలో ఉన్నత పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇతనికి ముగ్గురు ఆడ సంతానం. కృష్ణ దేవరావును దత్త పుత్రునిగా స్వీకరించారు.

వాతావరణం

ఈ పట్టణ వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండటం వలన ఏడాదిలో 9 నెలలు (మార్చి, ఏప్రిల్, మే మినహా) ఆహ్లాదకరంగా ఉంటుంది. వేడిమి, ఇతర ప్రధాన నగరాలలాగానే కనిపించినా, వాస్తవ వేడిమి, ఏ మాత్రం తేడా లేకుండా ఉంటుంది. ఇతర జిల్లా ప్రధాన నగరాల్లో కర్నూలు, వరంగల్ నగరాలలో కనిపించే వాతావరణం కన్నా సుమారు 9 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.

విద్యాసంస్థలు

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1969-70)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1988-89)
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉర్దూ మీడియం (స్థాపన:2003-04)
  • శ్రీవాణి జూనియర్ కళాశాల (స్థాపన:2006-07)
  • స్కాలర్స్ జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
  • చైతన్య జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
  • వాగ్దేవి మహిళల జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
  • కొట్టం మాణిక్యమ్మ జూనియర్ కళాశాల (స్థాపన: 2005-06)
  • ఎస్.వి.ఎం.ఆర్.బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:2005-06)
  • వివేక్ జూనియర్ కళాశాల (స్థాపన:2005-06)
  • సి.వి.రామన్‌ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97)
  • జాగృతి‌ జూనియర్ కళాశాల (స్థాపన:2006-07)
  • గాయత్రీ డిగ్రీ కళాశాల

పట్టణ విశేషాలు

  • రాష్ట్రం లోనే మొదటి  పాలిటెక్నిక్‌ కళాశాలను వనపర్తిలో 1959 అక్టోబరు 11 న విజయ దశిమి రోజున మాజీ భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, దివంగత రాజా రామేశ్వర్ రావు  ప్రారంభించారు. నీలం సంజీవరెడ్డి వంటి కొన్ని ముఖ్యమైన రాజకీయ వ్యక్తులు ఎపి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పటి ప్రణాళిక మంత్రి ఎస్.బి. పట్టాబీ రామయ్య, అప్పటి విద్యాశాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి డి. సంజీవయ్య,  మాజీ వ్యవసాయ మంత్రి పి. తిమ్మా రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • రాష్ట్రంలోనే తొలి ఆదర్శ వివాహితుల సంక్షేమ సమితి వనపర్తిలో 1997 ఫిబ్రవరి 16న ఏర్పాటైంది.
  • 2022, మార్చి 8న మధ్యాహ్నం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదిక‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌న ఊరు – మ‌న బ‌డి పథకం ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక-ఎక్సైజ్-క్రీడీ శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5][6] ఆ తరువాత వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్, సాయంత్రం ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న చేసాడు.[7]
  • 75 లక్షల రూపాయలతో నిర్మించిన ఆచార్య జయశంకర్‌ పార్కు-కాంస్య విగ్రహం, 2.80 కోట్ల రూపాయలతో నిర్మించిన షాదీఖాన, కోటి రూపాయలతో రాజీవ్‌చౌక్‌లో నిర్మించిన సురవరం గ్రంథాలయం, 20 కోట్ల రూపాయలతో గంజ్‌లో నిర్మించిన సమీకృత మార్కెట్‌, 5.75 కోట్ల రూపాయలతో నిర్మించిన టౌన్‌ హాల్‌ మొదలైన వాటిని 2023, సెప్టెంబరు 29న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[8]
  • 2.75 కోట్లతో నిర్మించే బీఎస్సీ అగ్రికల్చర్‌ కళాశాల, 22 కోట్లతో నిర్మించే వనపర్తి కేడీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల వసతి గృహాలకు, రాజభవనం పునర్నిర్మాణ పనులకు, 25.52 కోట్లతో నిర్మించే జేఎన్‌ టీయూ హాస్టల్‌ భవనాలకు, గంజ్‌లో ఐటీ టవర్‌ నిర్మాణానికి 2023, సెప్టెంబరు 29న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు.[8]

ఆరోగ్యం

వనపర్తి జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటికీ ప్రసవాలు ఎక్కువ జరగుతండడంతో గోపాల్ పేట రోడ్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా 17 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల వనపర్తి మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని, వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు సంజీవని ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రాన్ని (రూ.80 లక్షల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, బైపాస్ యంత్రం, 12 ఫోటోథెరఫి యంత్రాలు, రెండు కొత్త వెంటిలేటర్లు) 2022, జనవరి 25న రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి టి. హ‌రీశ్‌రావు ప్రారంభించాడు.[9] మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణం జరుగుతోంది. 15 - 17 ఏళ్ల పిల్లలకు 90 శాతం మందికి వాక్సిన్ వేసి రాష్ట్రంలో వనపర్తి జిల్లా అగ్రభాగంలో నిలిచింది.[10] 2021లో వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుచేయగా, ఈ వైద్య కళాశాలకు 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది.[11]

ఒకేరోజు 32 ప్రసవాలు

వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 2023, ఆగస్టు 21న ఒకేరోజు 32 (17 సాధారణ, 15 సిజేరియన్లు) ప్రసవాలు చేసినట్టు, తల్లీబిడ్డలు అంతా క్షేమంగానే ఉన్నట్టు ప్రొఫెసర్‌, హెచ్‌వోడీ అరుణకుమారి ప్రకటించారు.[12] 13 మందికి తొలి కాన్పులు జరగగా, వీరిలో 9 మందికి సాధారణ ప్రసవాలు అయ్యాయి. తాజా ప్రసవాల్లో 20 మంది మగ, 12 మంది ఆడ శిశువులు జన్మించారు.[13] గతంలోనూ వనపర్తి ఎంసీహెచ్‌వోలో 28 కాన్పులు చేసిన రికార్డు, ఇప్పుడు అధిగమించింది.

కోర్టు కాంప్లెక్స్

వనపర్తి జిల్లా తన జిల్లా ప్రిన్సిపల్‌, సెషన్స్‌ కోర్టు, అదనపు సివిల్‌ జడ్జి భవన సముదాయాన్ని 2022 డిసెంబరు 22న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి హైకోర్టు న్యాయమూర్తులు నాగార్జున, సాంబశివనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా జడ్జి హుజేబ్ అహ్మద్ ఖాన్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా, పోలీసు సూపరింటెండెంట్ అపూర్వరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ కుమార్, జిల్లా న్యాయవాదులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.[14]

ఎస్పీ కార్యాలయం

వనపర్తి పట్టణంలోని 29 ఎక‌రాల సువి‌శాల స్థలంలో.. మూడం‌త‌స్థుల్లో 60 గదు‌లతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని 2023 మే 30న రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించాడు.[15] ఇందులో ఎస్పీ, ఏఎస్పీ, ఓఎ‌స్‌‌డీ‌లకు ప్రత్యేక గదు‌ల‌తో‌పాటు రెస్ట్‌ రూంలు, నేరా‌లను ఛేదిం‌చేలా క్రైం విభాగం, పరి‌పా‌లనా విభా‌గా‌ల‌ఉ, ఇంటె‌లి‌జెన్స్‌, డాగ్‌ స్క్వాడ్‌, డిజి‌టల్‌ ల్యాబ్‌లు, ట్రైనింగ్‌ హాల్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఐటీ కోర్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, సైబర్‌ ల్యాబ్‌, పీడీ సెల్‌, నాలుగు సెమినార్ హాళ్ళు, ఇన్‌‌వార్డు, ఔట్‌‌వార్డు, మినీ కాన్ఫ‌రె‌న్స్‌‌హాల్‌, పరేడ్‌ గ్రౌండ్‌, పార్కు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, డీజీపీ అంజనీకుమర్‌, జిల్లా కలెక్టర్ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా ఎస్పీ రక్షితా మూర్తి, అధికారులు పాల్గొన్నారు.[16]

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా పట్టణంలోని పీర్లగుట్ట వద్ద నిర్మించిన 294 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను 2023 సెప్టెంబరు 29న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు.[17][18] ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంటకేశ్వర్‌ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు.[19]

పట్టణ ప్రముఖులు

  1. వంగీపురం నీరజాదేవి: కూచిపూడి నృత్యకారిణి[20]
  2. సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి: తెలంగాణ వ్యవసాయం మంత్రి
  3. రావుల చంద్రశేఖర్ రెడ్డి: రాజకీయాలు
  4. చిన్న రెడ్డి జిల్లెల: రాజకీయాలు
  5. కిరణ్ రావు: ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్
  6. దేవరాజు నాగార్జున: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి[21][22]
  7. సాయిచంద్ (జానపద గేయ కళాకారుడు )

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ