రజినీకాంత్

సుప్రసిద్ధ సినీ నటుడు
(రజనీకాంత్ నుండి దారిమార్పు చెందింది)

రజినీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడూ, నిర్మాతా, రచయితా. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు. అక్కడ ఆయన్ను సూపర్ స్టార్, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు. చిత్రాల్లో ఆయన పలికే సంభాషణలూ, ప్రత్యేకమైన శైలీ దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160 కి పైగా చిత్రాల్లో నటించాడు.

రజినీకాంత్
2019 లో రజినీకాంత్
జననం
శివాజీరావు గైక్వాడ్

(1950-12-12) 1950 డిసెంబరు 12 (వయసు 73)[1]
బెంగళూరు, మైసూరు రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక)
ఇతర పేర్లు
రజనీ, రజినీ
వృత్తి
నటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1975–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు
పురస్కారాలుదాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (2020)[2]
పద్మ విభూషణ్ (2016)[3]
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2016)
పద్మభూషణ్ (2000)
కళైమామణి (1984)
(పూర్తి జాబితా)

1975 లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995 లో సురేశ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన "బాషా" చిత్రం ఘన విజయం సాధించి రజినీకాంత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.[4] 2007 లో వచ్చిన శివాజీ చిత్రం వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010 లో వచ్చిన రోబో, 2018 లో వచ్చిన 2.0 సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

చలనచిత్ర రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది.[5][6] ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.

బాల్యం, విద్యాభ్యాసం

రజనీకాంత్ 1950 డిసెంబరు 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.[7][8] మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాషా మాట్లాడేవాళ్ళు. రజినీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర, పుణె సమీపంలోని మావడి కడెపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజినీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణ రావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్ బాలూభాయి. 1956 లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్‌కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజినీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయాడు.

రజినీకాంత్ గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్ లో ప్రాథమిక విద్య నభ్యసించాడు. చిన్నతనంలో చురుకైన విద్యార్థిగా ఉండేవాడు. క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ ఆటల మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. ఇదే సమయంలో రజినీకాంత్ సోదరుడు ఆయన్ను రామకృష్ణ మఠంలో చేర్చాడు. ఇక్కడ ఆయనకు వేదాల గురించి, సంప్రదాయాల గురించి, చరిత్ర గురించి బోధించేవారు. దాంతో ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది. ఆధ్యాత్మిక పాఠాలతో పాటు అక్కడ నాటకాలలో కూడా పాల్గొనేవాడు. ఒకసారి మఠంలో ఏర్పాటు చేసిన పౌరాణిక నాటకంలో ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో ఆయన నటనకు గాను కన్నడ కవి డి.ఆర్.బెంద్రే ప్రశంసలు లభించాయి. ఆయనకు నటన పట్ల క్రమ క్రమంగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.

పాఠశాల విద్య పూర్తి కాగానే, రజనీకాంత్ కూలీతో సహా అనేక పనులు చేశాడు. తర్వాత బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS)లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. కన్నడ నాటక రచయిత టోపి మునియప్ప తన పౌరాణిక నాటకాలలో ఒకదానిలో నటించే అవకాశం ఇచ్చిన తర్వాత నాటకాలలో పాల్గొనడం కొనసాగించాడు. ఒక ప్రకటనను చూసిన తర్వాత కొత్తగా ఏర్పడిన మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నట శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ, అతని స్నేహితుడూ, సహోద్యోగీ ఐన రాజ్ బహదూర్ అతన్ని సంస్థలో చేరేలా ప్రోత్సహించి, ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. శిక్షణా సంస్థలో ఉన్న సమయంలో, తమిళ చిత్ర దర్శకుడు కె.బాలచందర్ అతన్ని గుర్తించాడు. అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేశన్‌తో గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరును కాస్త తెరమీద రజినీకాంత్‌ అని మార్చాడు. అతని మునుపటి చిత్రం మేజర్ చంద్రకాంత్‌లోని పాత్ర పేరు నుండి దీనిని తీసుకున్నారు. అలాగే తమిళం మాట్లాడటం నేర్చుకోమని దర్శకుడు అతనికి సలహా ఇచ్చాడు. రజనీకాంత్ వెంటనే ఆ సలహాను అనుసరించాడు.

నటనా వృత్తి

1975-77: తొలినాళ్ళు

రజినీకాంత్ 1975 లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శ్రీవిద్య మాజీ భర్తగా రజినీకాంత్ చిన్నపాత్ర వేశాడు. ఈ చిత్రంలో వయసులో పెద్ద తేడాలున్న వారి మధ్య బాంధవ్యాల గురించిన కథ ఉంటుంది. ఇది విడుదలైనప్పుడు కొంత వివాదాలను కూడా చవి చూసింది. అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుని 1976 లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు మూడింటిని చేజిక్కించుకుంది. ఆంగ్ల దినపత్రిక ది హిందూ, కొత్త నటుడు రజినీకాంత్ చక్కగా నటించాడని ప్రశంసించింది. తర్వాత రజినీ నటించిన చిత్రం పుట్టణ్ణ కనగల్ దర్శకత్వం వహించిన కథా సంగమ (1976). ఈ సినిమాలో రజినీకాంత్ చివర్లో ఒక రౌడీ పాత్రలో కనిపిస్తాడు. తర్వాత దర్శకుడు కె.బాలచందర్ తాను తమిళంలో రూపొందించిన అవల్ ఒరు తొడర్ కతై (1974) కి తెలుగు పునర్నిర్మాణమైన అంతులేని కథ (1976) సినిమాలో నటింపజేశాడు. మూండ్రు ముడిచ్చు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమాలో రజినీ సిగరెట్ పైకి ఎగరేసి కాల్చే స్టైలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1976లో ఆయన చివరి చిత్రం బాలు జేను. ఈ సినిమాలో కథానాయికను ఏడిపించే ప్రధాన విలన్ పాత్ర పోషించాడు. 1977 లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అవర్‌గళ్, భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వయదినిలే చిత్రాల్లో ఇలాంటి పాత్రల్లోనే నటించాడు. 1977 మధ్యలో తెలుగులో మొట్టమొదటి సారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించాడు.

1978 - 1989 ప్రయోగాలు, గుర్తింపు

1978 లో రజినీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి.[9][10] ఇందులో మొదటి పి. మాధవన్ దర్శకత్వం వహించిన శంకర్ సలీం సిమోన్. ఈ సినిమాలో రజినీ ముగ్గురు కథానాయకుల్లో ఒకడు. తర్వాత కన్నడ నటుడు విష్ణువర్ధన్తో కలిసి కిలాడీ కిట్టు అనే సినిమాలో నటించాడు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నాదమ్ముల సవాల్ అనే చిత్రంలో రెండో కథానాయకుడుగా నటించాడు. ఈ సినిమాకు కన్నడ మాతృకలో కూడా రజినీకాంత్ అదే పాత్రలో నటించాడు. ఎం.భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భైరవి రజినీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం. ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకడైన ఎస్.థాను 35 అడుగుల ఎత్తైన రజినీకాంత్ కటవుట్ ఏర్పాటు చేశాడు. 1979 లో ఎన్.టి.ఆర్తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో నటించాడు.

హిందీ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ను తన రోల్ మోడల్ గా పేర్కొనే రజినీ, అమితాబ్ హిందీలో నటించిన చిత్రాల పునర్నిర్మాణాలలో కథానాయకుడిగా నటించడం ఈ దశకంలోనే ప్రారంభమైంది. 1978లో వచ్చిన శంకర్ సలీం సిమోన్ సినిమా, 1977 లో అమితాబ్ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాకు పునర్నిర్మాణం. అదే సినిమా రామ్ రాబర్ట్ రహీమ్ అనే పేరుతో తెలుగులో పునర్నిర్మిస్తే అందులో కూడా రజినీ నటించడం విశేషం. ఈ దశకంలో మొత్తం 11 హిందీ చిత్రాల పునర్నిర్మాణాలలో రజినీ నటించాడు.

1983 వచ్చే సరికి తమిళంలోనే కాక తెలుగు, కన్నడ భాషల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందిన నటుడు అయ్యాడు. అదే సంవత్సరంలో అమితాబ్ బచ్చన్, హేమమాలినిలతో కలిసి అంధా కానూన్ అనే బాలీవుడ్ చిత్రంలో మొదటిసారిగా నటించాడు.

1990 - 2001 వ్యాపారాత్మక విజయం

1990వ దశకానికి వచ్చే సరికి రజినీకాంత్ కమర్షియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దశకంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. ఈ దశకంలో రజినీకాంత్ తొలి సినిమా పనక్కరన్ (1990) మంచి విజయం సాధించింది. తర్వాత అదే సంవత్సరంలో అతిశయ పిరవి అనే సినిమాలో నటించాడు. ఇది చిరంజీవి హీరోగా 1988లో వచ్చిన యముడికి మొగుడు చిత్రానికి పునర్నిర్మాణం. 1991లో ధర్మ దొరై అనే సినిమాలో నటించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఓ మాదిరి వసూళ్ళు రాబట్టాయి.

1995 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాషా సినిమా పరిశ్రమలో రికార్డు సృష్టించింది. ప్రేక్షకులకు ఆయన మరింత చేరువ చేసింది. అదే సంవత్సరంలో తన మిత్రుడైన మోహన్ బాబుకు, పెదరాయుడు సినిమాకు హక్కులు తీసుకోవడంలో సహాయం చేసి ఆ సినిమాలో అతిథి పాత్రను కూడా పోషించాడు. 1995లోనే మలయాళం సినిమా తెన్మవిన్ కొంబత్తును కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కె.బాలచందర్ నిర్మాతగా తమిళం, తెలుగు భాషల్లో ముత్తు పేరుతో నిర్మించారు. ఈ సినిమా కూడా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది. ఇది జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది.

2002-2010 ఆటుపోట్లు, పునరుత్తేజం

కొంత కాలం విరామం తర్వాత 2002 లో రజినీకాంత్ బాబా అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాశాడు. ఈ సినిమా అభిమానుల ఉత్సాహంతో విపరీతమైన ప్రచారం మధ్య ఈ చిత్రం విడుదలైంది. ఒక గ్యాంగ్‌స్టర్ తన పద్ధతిని మార్చుకుని రాజకీయ విప్లవం సాధించడం ఈ చిత్ర నేపథ్యం. కానీ ఇది మార్కెట్ అంచనాలు అందుకోలేక చతికిల పడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది. నష్టపోయిన వారికి రజనీకాంత్ స్వయంగా సొమ్ము చెల్లించాడు. పి.ఎం.కె అధ్యక్షుడు రాందాస్ ఈ సినిమాతో రజినీకాంత్ బిడీలు కాల్చడం వంటి దురలవాట్లతో తమిళ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించాడు. ఆ పార్టీ కార్యకర్తలు సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్ల పై దాడి చేసి ఫిల్ములను తగులబెట్టారు.

రెండేళ్ల విరామం తర్వాత మలయాళం సినిమా అయిన మణిచిత్రతాళుకు పునర్నిర్మాణం అయిన చంద్రముఖి సినిమాలో, పి.వాసు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడమే కాక 2007లో అత్యధిక కాలం నడిచిన తమిళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇది టర్కిష్, జర్మన్ భాషల్లోకి కూడా అనువాదం అయింది. తర్వాత శంకర్ దర్శకత్వంలో ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో శివాజీ సినిమాలో నటించాడు. రెండు సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ, దక్షిణాఫ్రికాలోనూ "టాప్-టెన్ బెస్ట్ ఫిల్మ్స్" జాబితాకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరుతెచ్చుకుంది.[11][12] ఈ సినిమాకి రజనీకాంత్ 27 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం.[13][14][15]

నటించిన సినిమాల పాక్షిక జాబితా

వ్యక్తిగత జీవితం

వివాహత్పూర్వ సంబంధాలు

బెంగుళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో రజనీకాంత్‌కి నిర్మల అనే వైద్య విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అతను ఒక రంగస్థల నాటకంలో ప్రదర్శన ఇవ్వడం చూసి, నటనా వృత్తిని కొనసాగించమని ప్రోత్సహించింది. అతని తరపున తెలియకుండా అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి ఒక దరఖాస్తు పంపింది. అతను ఆఫర్‌ను స్వీకరించి తన నటనా జీవితాన్ని కొనసాగించినప్పటికీ, రజనీకాంత్ అప్పటి నుండి ఆమెతో సంబంధాలు కోల్పోయాడు.[16]

కుటుంబం

రజనీకాంత్ లతా రంగాచారిని వివాహం చేసుకున్నాడు. ఆమె యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని. ఒకసారి ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం అతనిని ఇంటర్వ్యూ చేసింది.[17][18] వీరి వివాహం 1981 ఫిబ్రవరి 26 న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగింది.[19] ఈ దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత "ది ఆశ్రమ్" పేరుతో పాఠశాలను నడుపుతోంది.

ఐశ్వర్య 2004 నవంబరు 18న నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుంది. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని చిన్న కుమార్తె సౌందర్య, తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2010 సెప్టెంబరు 3న పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. వారికి వేద్ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. వీరు 2016 సెప్టెంబరులో విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సౌందర్య వెల్లడించింది. 2017 జూలైలో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె 2019 ఫిబ్రవరి 11న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో నటుడు, వ్యాపారవేత్త అయిన విశాఖన్ వనంగముడిని వివాహం చేసుకుంది.

విమర్శలు, ప్రశంసలు

నటనా శైలి

రజినీకాంత్‌ను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా పరిగణిస్తారు. అతని జనాదరణకు "సంభాషణలను పలుకు ప్రత్యేకమైన శైలీ , నటనలో విలక్షణ ధోరణులతో పాటు, రాజకీయ ప్రకటనలూ, దాతృత్వం కూడా" కారణమని చెబుతారు. ఇంకా నిజ జీవితంలో నిరాడంబరతను కొనసాగిస్తూనే ఆయన అనేక చిత్రాలలో తన జీవితంలో కంటే పెద్దగా సూపర్-హీరోగా కనిపించడం, తెరమీద కనబర్చే అనూహ్యమైన విన్యాసాలూ, ఆకర్షణీయమైన వ్యక్తీకరణలూ మొదలైనవి కూడా కారణమే. రజనీకాంత్ దాదాపు తన ప్రతి చిత్రంలోనూ అసమానమైన శైలిలో పంచ్‌లైన్‌లను విసురుతాడు. ఇవి తరచూ సందేశాన్ని కలిగి ఉంటాయి లేదా సినిమా విరోధులను హెచ్చరిస్తాయి. ఈ పంక్తులు సాధారణంగా కొత్త వాటిని సృష్టించడానికి లేదా హాస్యాస్పదంగా తీయడానికి కల్పితమైనవి, కానీ వీక్షకులలో వినోదాన్ని సృష్టించడంలో విఫలం కాలేదు.

తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుల్లో రజనీకాంత్ ఒకరు. 2014లో తన మొదటి అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన తర్వాత, రజనీకాంత్ 24 గంటల్లోనే 210,000 మంది ఫాలోవర్లను అందుకున్నారు, ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా పెరగలేదని పేర్కొన్నాయి.

సామాజిక సమస్యలపై వ్యాఖ్యలు

2002లో, తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయకూడదనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రజనీకాంత్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాడు. భారతీయ నదులను అనుసంధానం చేసే ప్రణాళికకు ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. అతను ప్రాజెక్ట్ కోసం మద్దతునిచ్చేందుకు భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని, పలువురు నిపుణులను కలిశాడు. అతని నిరాహారదీక్షతో తమిళ సినిమా నటుల నడిగర్ సంఘంతో సంబంధం లేదు. వారు ప్రత్యేకంగా సంఘీభావ నిరసనను నిర్వహించారు. చలనచిత్ర దర్శకుడు భారతి రాజా రజనీకాంత్‌పై విరుచుకుపడ్డారు, అతను చలనచిత్ర పరిశ్రమను విభజించాడని ఆరోపించాడు, అతను "కర్ణాటక ప్రభుత్వంతో నిశ్శబ్ద అవగాహన కలిగి ఉన్న ద్రోహి" అని చెప్పాడు.

2008లో, హోగెనక్కల్ జలపాతం నీటి వివాదంపై కర్ణాటక వైఖరికి వ్యతిరేకంగా నడిగర్ సంఘం నిర్వహించిన నిరాహారదీక్షలో రజనీకాంత్ పాల్గొని కర్ణాటకలోని రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రసంగించారు. ఇందువల్ల రజినీకాంత్, ఆయన నటించిన కుసేలన్ (2008)పై నిషేధాన్ని ప్రకటించడానికి దారితీసింది. టీవీ9 కన్నడలో రజనీకాంత్ కనిపించి తన ప్రసంగానికి క్షమాపణలు చెప్పడంతో నిషేధం ఎత్తివేయబడింది. అనంతరం నిషేధాన్ని ఎత్తివేసి రాష్ట్రంలో సినిమా విడుదలకు అనుమతించినందుకు కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక పట్ల క్షమాపణలు, కృతజ్ఞతా భావం నడిగర్ సంఘం సభ్యులు R. శరత్‌కుమార్, సత్యరాజ్, రాధా రవి నుండి తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసింది. క్షమాపణ చెప్పడం తమిళులకు అవమానకరమని, అతని ప్రసంగం కన్నడ ప్రజల మనోభావాలను ఎప్పుడూ రెచ్చగొట్టలేదని అభిప్రాయపడ్డారు. 2010లో తమిళ సినీ ప్రముఖులను రాజకీయ వ్యవహారాల్లో బలవంతంగా చేర్చుకోవడాన్ని ఖండించిన తోటి నటుడు అజిత్ కుమార్‌కు రజనీకాంత్ మద్దతు ఇవ్వడం వివాదంగా మారింది. 2018 మేలో, తూత్తుకుడి ఊచకోత సమయంలో పోలీసు చర్యను సమర్థించిన తర్వాత రజనీకాంత్ ప్రతికూల విమర్శలు, ప్రతిస్పందనలను అందుకున్నారు.

2020లో, రజనీకాంత్ ఔట్‌లుక్ నుండి 2017 కథనాన్ని ఉటంకించారు, ఇది 1971లో జరిగిన నాస్తిక ర్యాలీలో ద్రావిడర్ కళగం వ్యవస్థాపకుడు పెరియార్ E.V. రామసామి హిందూ దేవతలైన రాముడు, సీత విగ్రహాలకు పాదరక్షలతో పూలమాల వేసిందని నివేదించింది. అతని వ్యాఖ్యలను పెరియార్ మద్దతుదారులు విమర్శించారు. ఎదురుదెబ్బపై రజనీకాంత్ స్పందిస్తూ, "నేను జరగని విషయంపై మాట్లాడలేదు. నేను నివేదించిన వాటిపై మాత్రమే మాట్లాడాను. ఇది ఔట్‌లుక్‌లో కూడా నివేదించబడింది. క్షమించండి, నేను క్షమాపణ చెప్పను" అని చెప్పాడు.

పొందిన పురస్కారాలు

రజినీకాంత్ తాను నటించిన సినిమాలకు చాలా పురస్కారాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం తమిళ సినిమాలే. 1984 లో నల్లవనుకు నల్లవాన్ అనే తమిళ సినిమాకు గాను మొదటిసారిగా ఉత్తమ తమిళ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. ఇప్పటిదాకా ఆయన అందుకున్న ఏకైన ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అదే. తర్వాత శివాజీ (2007), రోబో (2010) సినిమాలకు కూడా ఫిల్మ్ ఫేర్ నామినేషన్లకు ఎంపికయ్యాడు. 2014 నాటికి రజినీకాంత్ ఆరు సార్లు తమిళనాడు ప్రభుత్వ సినిమా పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా పలుమార్లు సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారాలు, అభిమానుల తరపున సినిమాల్లో, బయట ఆయన చేసిన సేవలకు కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు.[20]

రజినీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి 1984 లో కలైమామణి, 1989 లో ఎం.జి.ఆర్ పురస్కారాన్ని అందుకున్నాడు. 1995 లో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కలైచెల్వం పురస్కారాన్ని అందుకున్నాడు. ఇతనికి 2016 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది.[21] 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందాడు.[22]

వెలుపలి లింకులు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ