ఫాలో ఆన్

క్రికెట్ ఆటలో, రెండవ బ్యాటింగ్ చేసిన జట్టు మొదటి ఇన్నింగ్సులో చేసిన స్కోరు, మొదటి జట్టు చేసిన స్కోరు కంటే నిర్దుష్టమైన సంఖ్యకు పైగా పరుగులు తక్కువగా ఉంటే, రెండవ జట్టును వెంటనే రెండవ ఇన్నింగ్సు ఆడమని మొదటి జట్టు కెప్టెన్ చెప్పవచ్చు. దీన్ని ఫాలో-ఆన్‌ అంటారు. టెస్టు డ్రా అయ్యే అవకాశాలను తగ్గించి, తక్కువ స్కోరు చేసిన జట్టును రెండవ ఇన్నింగ్సులో త్వరగా ఆలౌట్ చేసి గెలుపు సాధించే యోచనతో మొదటి జట్టు ఫాలో ఆన్ వ్యూహాన్ని అవలంబిస్తుంది. మామూలు పద్ధతిలో లాగా మొదటి జట్టు తమ రెండవ ఇన్నింగ్సు కూడా ఆడి త్వరగా డిక్లేరు చేసి కూడా మ్యాచ్‌ను గెలిచేందుకు ప్రయత్నించవచ్చు, కానీ, ఈ పధ్దతిలో సరిగా ఆడని జట్టుకు అనర్హమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

సాంప్రదాయ క్రమంఫాలో-ఆన్ ఆడేటపుడు
1.ముందు బ్యాటింగ్ చేసే జట్టు1.ముందు బ్యాటింగ్ చేసే జట్టు
2.రెండో బ్యాటింగ్ చేసే జట్టు2.రెండో బ్యాటింగ్ చేసే జట్టు
3.ముందు బ్యాటింగ్ చేసే జట్టు3.రెండో బ్యాటింగ్ చేసే జట్టు
4.రెండో బ్యాటింగ్ చేసే జట్టు4.ముందు బ్యాటింగ్ చేసే జట్టు

ప్రతి జట్టు రెండుసార్లు బ్యాటింగ్ చేసే మ్యాచ్‌లలో మాత్రమే ఫాలో-ఆన్ జరుగుతుంది: ముఖ్యంగా దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఈ నిఅయమం వాడుకలో ఉంది. ఈ తరహా క్రికెట్‌లో, కనీసం మూడు ఇన్నింగ్స్‌లు పూర్తి చేస్తే తప్ప ఏ జట్టుకూ గెలుపు రాదు. ఆట ముగిసే సమయానికి మూడు కంటే తక్కువ ఇన్నింగ్స్‌లు మాత్రమే పూర్తయితే, మ్యాచ్ ఫలితం డ్రా అవుతుంది.

ఫాలో-ఆన్‌ని అమలు చేయాలనే నిర్ణయం మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కెప్టెన్ది. అతను స్కోరులను, రెండు వైపుల స్పష్టమైన బలం, వాతావరణం, పిచ్, మ్యాచ్‌లో ఇంకా మిగిలి ఉన్న సమయాన్ని పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంటాడు.

ఫాలో-ఆన్ అమలు చేయబడే పరిస్థితులను నియంత్రించే నియమాలను క్రికెట్ చట్టాల చట్టం 14 లో చేఋచారు.

ఉదాహరణ

భారత జాతీయ క్రికెట్ జట్టు 2017 శ్రీలంక పర్యటనలో, రెండో టెస్టులో, భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. శ్రీలంక రెండవ బ్యాటింగ్ చేసి, భారత మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే శ్రీలంక స్కోరు 200 పరుగుల కంటే ఎక్కువ వెనకబడి ఉండడంతో ఫాలో-ఆన్‌ ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్, ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  1. భారత్ స్కోరు 622/9, డిక్లేరు చేసింది
  2. శ్రీలంక 183 పరుగులకు ఆలౌటైంది
  3. శ్రీలంక 386 పరుగులకు ఆలౌటైంది

అయితే అదే సిరీస్‌లోని మొదటి టెస్టులో బ్యాటింగ్ చేసిన ఇన్నింగ్స్ క్రమానికి ఇది భిన్నంగా ఉంది. ఆ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలో-ఆన్‌ను అమలు చేసే హక్కు ఉన్నప్పటికీ, అలా చెయ్యలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ 304 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  1. భారత్ 600 పరుగులు చేసింది
  2. శ్రీలంక 291 పరుగులకు ఆలౌటైంది
  3. భారత్ స్కోరు 240/3, డిక్లేరు చేసింది
  4. శ్రీలంక 245 పరుగులకు ఆలౌటైంది

కనిష్ట ఆధిక్యం

క్రికెట్ చట్టాల చట్టం 14 [1] ఫాలో-ఆన్‌ను అమలు చేయడానికి డిఫెండింగ్ జట్టుకు అవసరమైన కనీస ఆధిక్యాన్ని నిర్వచించడంలో మ్యాచ్ వ్యవధిని పరిగణిస్తారు:

  • ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉన్న మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 200 పరుగుల ఆధిక్యంలో ఉన్న జట్టు రెండో జట్టును ఫాలో-ఆన్‌ ఆడీంచే అవకాశం ఉంటుంది. [a]
  • మూడు, నాలుగు రోజుల మ్యాచ్‌లో కనీసం 150 పరుగుల ఆధిక్యం.
  • రెండు రోజుల మ్యాచ్‌లో కనీసం 100 పరుగుల ఆధిక్యం.
  • వన్డే మ్యాచ్‌లో కనీసం 75 పరుగుల ఆధిక్యం.

మ్యాచ్ ప్రారంభం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఆలస్యమైనప్పుడు, ఉదా, చెడు వాతావరణం కారణంగా, ఫాలో-ఆన్‌ని అమలు చేయడానికి అవసరమైన స్కోర్ లీడ్ తదనుగుణంగా తగ్గుతుంది. అయినప్పటికీ, మ్యాచ్ ప్రారంభమైన తర్వాత దానిని తగ్గించినప్పుడు, ఫాలో-ఆన్‌ని అమలు చేయడానికి అవసరమైన స్కోరు ఆధిక్యం మారదు.

అమలు

ఫాలో-ఆన్ ఆటోమేటిగ్గా ఇచ్చేది కాదు. అవతలి జట్టును ఫాలో ఆన్ ఆడించాలా వద్దా అనేది పూర్తిగా ముందంజలో ఉన్న జట్టు కెప్టెన్ నిర్ణయమే. సాంప్రదాయికంగా ఫాలో-ఆన్ దాదాపు అన్నివేళలా అమలు చేస్తూ ఉంటారు. ది ఆర్ట్ ఆఫ్ కెప్టెన్సీ పుస్తకంలో మైక్ బ్రేర్లీ ఈ సమస్యను ఒకే పేరాగ్రాఫ్‌లో వివరించాడు. ఫాలో ఆన్ ప్రయోజనాలు అపరిమితమని అతని ఉద్దేశం.[2]

  1. ఫాలో-ఆన్‌ని అమలు చేయడానికి ప్రధాన కారణం డ్రాని నిరోధించడం. ఛేజింగు చేసే జట్టు చివరిగా బ్యాటింగు చేస్తే, జాగ్రత్తగా బ్యాటింగు చేసి, మ్యాచ్‌ని ఓడిపోకుండా డ్రా అయ్యేలా కాలయాపన చేసే అవకాశం ఉంటుంది, ఫాలో-ఆన్ ఆడిస్తే, ఆ జట్టుకు సమయం ఎక్కువ ఉండి, ఆ వ్యూహాన్ని అమలు చెయ్యడాం కష్టమౌతుంది.
  2. ఫాలో-ఆన్‌ను అమలు చేయడం వలన, ఛేజింగ్ జట్టు అప్పటికే స్కోరులో వనకబడి ఉంది కాబట్టి ఒత్తిడి పెరుగుతుంది. పైగా మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ స్థితి క్షీణిస్తూ ఉంటుంది.

అయితే, ఫాలో-ఆన్‌ని అమలు చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి:

  1. చాలా సరళంగా చెప్పాలంటే, బౌలర్లు వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేయడం వలన అలసిపోతారు. జట్టును వారి మొదటి ఇన్నింగ్స్‌లో కంటే రెండవ ఇన్నింగ్స్‌లో ఔట్ చేయడం చాలా కష్టం. 1958 సిరీస్‌లో పాకిస్తాన్, వెస్టిండీస్ ల మధ్య జనవరి 17-23 మధ్య జరిగిన జరిగిన మొదటి టెస్టులో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 579/9 వద్ద డిక్లేర్ చేయగా, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్సులో 106 కు ఆలౌటైంది. ఆరు రోజుల మ్యాచ్‌లో (ఒకరోజు విశ్రాంతితో కలుపుకుని) వెస్టిండీస్ మూడో రోజున పాకిస్థాన్‌ను ఫాలో-ఆన్ ఆడించింది. పాక్ రెండవ ఇన్నింగ్సులో హనీఫ్ మహమ్మద్ 970 నిమిషాల పాటు ఆడి, 337 పరుగులు చేసి టెస్టును డ్రాగా ముగించాడు. [3]
  2. మొదటి జట్టు ఫాలో-ఆన్‌ని అమలు చేయకపోతే, అది ఓడిపోయే సంభావ్యతను తగ్గిస్తుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్‌లో గణనీయమైన ఆధిక్యంతో ఉన్న ఆ జట్టు ఛేజింగ్ జట్టు గెలుపొందలేనన్ని ఎక్కువ పరుగులు సాధించగలదు. అలాగే ఆ జట్టుకు తగినంత సమయం లేకుండా కూడా చెయ్యగలదు. అయితే దీనివలన, మ్యాచ్ డ్రా అయ్యే సంభావ్యత పెరుగుతుంది.
  3. పిచ్ క్షీణించి, దాని స్వభావం స్పిన్ బౌలింగుకు అనుకూలంగా మారినప్పుడు చివరిగా బ్యాటింగ్ చేయడానికి ప్రతికూలంగా ఉంటుంది.

టెస్ట్ క్రికెట్‌లో ఇటీవలి సంవత్సరాలలో ఫాలో-ఆన్‌ని అమలు చేయకుండా ఉండే ధోరణి ఎక్కువగా ఉంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ అనేక సందర్భాల్లో ఫాలో ఆన్‌ ఆడించకుండా రెండవ ఇన్నింగ్స్‌ను తామే ముందు ఆడాలనే నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ పద్ధతిలో కొన్ని ముఖ్యమైన విజయాలను సాధించాడు. ఉదాహరణకు 2009 యాషెస్ సిరీస్‌లో లార్డ్స్‌లో, ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలో ఆన్ ఆడించేందుకు ఇది అనుకూలంగానే ఉంది. కానీ ఫాలో ఆన్ ఆడించకుండా, ఇంగ్లండే మళ్లీ బ్యాటింగ్ చేసి, ఆస్ట్రేలియాకు 522 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ ఆ మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది. ఆస్ట్రేలియన్ కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ లు కూడా ఫాలో-ఆన్‌ని అమలు చేయలేదు. అయితే, ఆటలో క్షీణిస్తున్న పిచ్‌పై నాలుగో ఇన్నింగ్సులో షేన్ వార్న్‌ చేత బౌలింగ్ చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది ఈ నిర్ణయం వెనక ఉన్న ముఖ్యమైన ఆలోచన. మైఖేల్ క్లార్క్ కెప్టెన్‌గా ఉండగా, తన కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే (2015 యాషెస్‌లో అతని ఆఖరి మ్యాచ్ సమయంలో) ఫాలో-ఆన్‌ను అమలు చేశాడు. తన ఫాస్ట్ బౌలర్లు అలసిపోయే ప్రమాదం కారణంగా గణనీయమైన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఉన్న సందర్భాల్లో కూడా అతడు ఫాలో ఆన్ ఆడించలేదు.

ఫాలో ఆన్ ఆడని జట్లు పొందిన విజయాలు

టెస్ట్ మ్యాచ్‌లు

1950 దక్షిణాఫ్రికా v ఆస్ట్రేలియా, కింగ్స్‌మీడ్

నాలుగు రోజుల టెస్టులో (మ్యాచ్ మధ్యలో ఒక విశ్రాంతి రోజుతో), దక్షిణాఫ్రికా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుని, 311 పరుగులు చేసింది. ఆ తరువాత, ఆఫ్‌స్పిన్నర్ హ్యూ టేఫీల్డ్ తీసిన 7–23 తో ఆస్ట్రేలియా 75 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికాకు 236 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ డడ్లీ నర్స్ వర్షం సూచనల కారణంగా ఫాలో-ఆన్‌ను అమలు చేయకుండా తామే రెండవ ఇన్నింగ్సును ఆడాలని ఎంచుకున్నాడు. కానీ వారి రెండవ ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్సులో నీల్ హార్వే చేసిన అజేయ 151 పరుగుల కారణంగా, 123.6 ఓవర్లలో 336 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలిచింది.

ఫాలో ఆన్ ఆడిన జట్లు సాధించిన విజయాలు

టెస్ట్ మ్యాచ్‌లు

టెస్టు క్రికెట్‌లో ఫాలోఆన్‌కు గురైన జట్టు, మ్యాచ్‌లో గెలిచిన సందర్భాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. యాదృచ్ఛికంగా, వీటిలో మొదటి మూడు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించింది.

1894–95 యాషెస్

సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 586 పరుగుల భారీ స్కోరు ( సిడ్ గ్రెగొరీ 201, జార్జ్ గిఫెన్ 161) చేసి ఇంగ్లాండ్‌ను 325 పరుగులకు ఆలౌట్ చేసి, ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. ఇంగ్లండ్ 437 పరుగులతో ప్రతిస్పందించి, 176 పరుగుల ఆధిక్యత సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండవ ఇన్నింగ్సులో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ముందంజలో ఉంది. కానీ ఆ రాత్రి భారీ వర్షం కురిసింది (ఆ కాలంలో, మ్యాచ్ జరిగే రోజుల్లో పిచ్‌లను కప్పేవారు కాదు). మరుసటి ఉదయం తడిగా ఉన్న పిచ్‌ మీద ఆస్ట్రేలియా బ్యాటర్లు, ఇంగ్లండ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లైన బాబీ పీల్, జానీ బ్రిగ్స్ లను ఆడలేకపోయారు. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను 166 పరుగులకు ఆలౌట్ చేసి, 10 పరుగుల తేడాతో గెలిచి,[4] సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది.

బోథమ్ టెస్ట్: ఇంగ్లండ్ v ఆస్ట్రేలియా, హెడింగ్లీ, 1981

1981లో, ఇంగ్లండ్‌కు చెందిన ఇయాన్ బోథమ్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా కెప్టెన్‌గా పేలవ ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఆ సమయంలో వెస్టిండీస్ జట్టు తర్వాత రెండవ స్థానంలో ఉంది. డెన్నిస్ లిల్లీ, టెర్రీ ఆల్డెర్మాన్, జెఫ్ లాసన్ రూపంలో బలీయమైన పేస్ దాడి ఉంది. వేసవిలో ఆరు టెస్టుల యాషెస్ సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమి, డ్రా తర్వాత, బోథమ్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

కెప్టెన్ బోథమ్ స్థానంలో వచ్చిన మైక్ బ్రేర్లీ హెడింగ్లీలో జరిగిన మూడో టెస్టుకు పగ్గాలు తీసుకున్నాడు. ఆ టెస్టు చాలా ఘోరంగా ప్రారంభమైంది: ఆస్ట్రేలియా 401 పరుగులు చేసింది (జాన్ డైసన్ 102; కిమ్ హ్యూస్ 89; కానీ బోథమ్ 6–95 తీసుకున్నాడు). ఇంగ్లండ్‌ను 174 పరుగులకు అవుట్ చేసిన తర్వాత (లిల్లీ 4–49; లాసన్ 3–32) ఫాలో ఆన్ చేయమని కోరింది. ఆ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు దక్కిన ఒకే ఒక్క ప్రకాశవంతమైన పాయింటు బోథమ్ చేసిన 50 పరుగులు.(అతను అంతకుముందు 13 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన తర్వాత అతని మొదటిది). రెండో ఇన్నింగ్స్‌లో, బోథమ్, ఇంగ్లండ్ 5 వికెట్లకు 105 పరుగుల వద్ద ఉండగా క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. జెఫ్రీ బాయ్‌కాట్, బాబ్ టేలర్ వెంటవెంటనే ఔటయ్యారు. ఇంగ్లాండ్ 7 వికెట్లకు 135, ఇంకా 92 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ ఓటమికి అవకాశం కనిపించింది.


రెండు వైపులా అందరూ ఇంగ్లాండ్ ఓడిపోయిందనే భావించారు. ల్యాడ్‌బ్రోక్స్ ప్రముఖంగా ఇంగ్లండ్‌ విజయానికి 500–1 ఆఫరు ఇచ్చారు.గ్రాహం డిల్లీ బ్యాటింగుకు వచ్చినపుడు బోథమ్, "రా రా, సరదాగా గడుపుదాం" అని చెప్పాడు. బోథమ్, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల నుండి అందిన మద్దతుతో 149 నాటౌట్‌గా నిలిచి, ఇంగ్లాండ్‌కు 129 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించాడు. మరుసటి రోజు బాబ్ విల్లీస్ చెలరేగి, 43 పరుగులకు 8 వికెట్లు తీసుకోవడంతో, ఆస్ట్రేలియా 111 పరుగులకు ఆలౌట్ అయి, మ్యాచ్ ఓడిపోయింది. [5]

ఇండియా v ఆస్ట్రేలియా, ఈడెన్ గార్డెన్స్, 2001

భారత ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో మొదటిదానితో సహా వరసగా 16 టెస్టు మ్యాచ్‌లను గెలుచుకున్న ఆస్ట్రేలియా, [6] రెండవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసి భారత్‌ను మొదటి ఇన్నింగ్సులో 171 పరుగులకే ఆలౌట్ చేసింది. వివిఎస్ లక్ష్మణ్ (59), రాహుల్ ద్రవిడ్ మాత్రమే 25 పరుగులు దాటారు. హ్యాట్రిక్ (రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్ ) సహా 123 పరుగులకు 7 వికెట్లు తీసుకున్న హర్భజన్ సింగ్ బౌలింగ్ మాత్రమే భారత్‌కు ఉపశమనం కలిగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫాలోఆన్‌ని అమలు చేసింది.

లక్ష్మణ్ 3వ రోజు ముగిసేలోపు క్రీజులోకి వచ్చి 281 పరుగులు చేసి, ఆ మ్యాచ్‌తో పాటు ఆ సిరీస్ గమనాన్ని కూడా మార్చాడు. అతను 180 కొట్టిన ద్రవిడ్‌తో కలిసి నాలుగో రోజు మొత్తం క్రీజులో ఉన్నారు. భారత జట్టు తమ రెండవ ఇన్నింగ్స్‌లో 657/7 (383 ఆధిక్యం) చేసి, చివరి రోజు లంచ్‌కు కొద్దిసేపటి ముందు డిక్లేర్ చేసింది (ఆస్ట్రేలియాకు గెలిచేందుకు తగినంత సమయం లేదు, కనీసం డ్రా అయినా చేసుకునే అవకాశం ఉంది). టీ సమయానికి, ఆస్ట్రేలియా 161/3 స్కోర్ చేసింది, డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఆస్ట్రేలియా 31 బంతుల వ్యవధిలో 8 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. హర్భజన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయగా, సచిన్ టెండూల్కర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌ విజయం సాధించింది. హర్భజన్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ లక్ష్మణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [7] భారత 171 పరుగుల విజయం, ఫాలో ఆన్ జట్టు సాధీంచిన నాలుగు టెస్ట్ విజయాలలో అతిపెద్దది (ఇంగ్లండ్ గెలుపు మార్జిన్లు రెండూ 20 పరుగుల కంటే తక్కువ). చరిత్రలో ఫాలో ఆన్ ఆడుతున్న జట్టు తమ ఇన్నింగ్సును డిక్లేర్ చేసి మరీ మ్యాచ్‌ గెలిచిన ఏకైక సందర్భం ఇది.

2003 న్యూజిలాండ్ v ఇంగ్లాండ్, వెల్లింగ్టన్

వెల్లింగ్‌టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి రోజున న్యూజిలాండ్, చరిత్రలో ఫాలో ఆన్ తర్వాత టెస్ట్ గెలిచిన నాల్గవ జట్టుగా, ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన ఏకైక జట్టుగా అవతరించింది.[8]

చరిత్ర

  • 1744: ఎటువంటి నిబంధన లేదు.
  • 1787: మొదటి తెలిసిన ఉదాహరణ; ఆ సమయంలో, మొదటి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు వెనుకబడినా లోటుతో సంబంధం లేకుండా మళ్లీ బ్యాటింగ్ చేయడం ఆనవాయితీగా ఉండేది (రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టు విషయంలో ఫాలో-ఆన్).
  • 1835: చట్టాలలో చేర్చారు. 100 పరుగుల లోటుంటే, తప్పనిసరి.
  • 1854: 80 పరుగుల లోటు తర్వాత తప్పనిసరి.
  • 1894: 120 పరుగుల లోటు తర్వాత తప్పనిసరి.
  • 1900: మూడు-రోజుల మ్యాచ్‌లో 150 పరుగులు, రెండు-రోజుల మ్యాచ్‌లో 100 పరుగులు, ఒక రోజు మ్యాచ్‌లో 75 పరుగుల లోటు తర్వాత ఐచ్ఛికం.
  • 1946: బ్యాటింగ్ జట్టు 300 పరుగులు చేసిన తర్వాత ప్రయోగాత్మక చట్టం మొదటి రోజు డిక్లరేషన్‌ను అనుమతించింది.
  • 1951: ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
  • 1957: పై నియమాన్ని చట్టం చేసారు. ప్రత్యర్థి కెప్టెన్‌తో ఒప్పందం ఫలితంగా డిక్లరేషన్లు చేయకూడదు.
  • 1961: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో దీన్ని పాటించకుండా నిలిపేసారు. కానీ 1963లో పునరుద్ధరించారు.[9]
  • 1980: ఐదు రోజుల మ్యాచ్‌లో 200 పరుగులు, మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్‌లో 150 పరుగులు, రెండు-రోజుల మ్యాచ్‌లో 100 పరుగులు, ఒక రోజు మ్యాచ్‌లో 75 పరుగుల లోటు తర్వాత ఐచ్ఛికం.

వనరులు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ