పాబ్లో ఎస్కోబార్

పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా (1949 డిసెంబరు 1 - 1993 డిసెంబరు 2) కొలంబియాకు చెందిన మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్‌లో 80 శాతం అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా 21.9 బిలియన్ డాలర్లు వ్యక్తిగత ఆదాయంగా సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజు (కింగ్ ఆఫ్ కొకైన్) అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందాడు. 1990ల్లో ఏటా 30 బిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించేవాడు,[2] తద్వారా అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడయ్యాడు.[3][4]

పాబ్లో ఎస్కోబార్
1977లో మెడలిన్ కంట్రోల్ ఏజెన్సీ తీసిన పాబ్లో ఎస్కోబార్ ఫోటో.
జననం.పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా
(1949-12-01)1949 డిసెంబరు 1
రియోనెగ్రో, కొలంబియా
మరణం1993 డిసెంబరు 2(1993-12-02) (వయసు 44)
మెడలిన్, కొలంబియా
నేరాలుమాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలు, హత్యలు, బాంబింగ్, లంచాలు, రాకెట్ నిర్వహణ
జరిమానా5 సంవత్సరాలు జైలుశిక్ష[1]
వృత్తిమెడలిన్ కార్టెల్ అనే స్మగ్లింగ్ వ్యవస్థ వ్యవస్థాపకుడు, రాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిమరియా విక్టోరియో (1976–1993; అతని మరణం వరకూ)
పిల్లలు
  • సెబాస్టియన్ మరోక్వీన్ (1977)
  • మనుయెలా ఎస్కోబార్ (1984)

కొలంబియా ప్రాంతంలోని రియోనెగ్రోలో జన్మించిన ఎస్కోబార్, సమీపంలోని మెడెలిన్‌లో పెరిగాడు. యూనివర్శిడాడ్ ఆటోనామా లాటినో అమెరికనా ఆఫ్ మెడెలిన్‌లో కొద్దికాలం పాటు చదువుకున్నా, డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేశాడు; నేర కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించి క్రమేపీ తప్పుడు బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టిక్కెట్లూ అమ్మసాగాడు. మోటారు వాహనాల దొంగతనంలోనూ పాల్గొన్నాడు. 1970ల్లో పలువురు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయడం ప్రారంభించాడు. తరచుగా జనాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించడమూ చేసేవాడు.ఎస్కోబార్ 1975లో యునైటెడ్ స్టేట్స్‌లో తొలి అక్రమరవాణా మార్గాన్ని ఏర్పరిచి, పౌడర్ కొకైన్ తానే అమ్మడం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో అతను వేగంగా విస్తరిస్తూ పోయాడు. ఇదే సమయంలో కొకైన్‌కు అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి లాభించింది. 1980ల నాటికి నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి యుఎస్‌కి రవాణా చేసేవాడని అంచనా. అతని డ్రగ్ నెట్‌వర్కును అది పుట్టిన నగరం పేరు మీదుగా మెడెలిన్ కార్టెల్ అని పిలుస్తారు. ఈ మెడెలిన్ కార్టెల్‌కి దాని పోటీ కార్టెల్‌లతో జాతీయంగా, అంతర్జాతీయంగా స్పర్థ ఉండేది. దాని కారణంగా హత్యాకాండకు పాల్పడేవారు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయనాయకుల హత్యలు చేసేవారు.

1982లో ఎస్కోబార్ లిబరల్ ఆల్టర్నేటివ్ ఉద్యమం కింద కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కి ప్రత్యామ్నాయ సభ్యునిగా ఎస్కోబార్ ఎన్నికయ్యాడు. ఈ అధికారం ఉపయోగించి పశ్చిమ కొలంబియాలో ఫుట్‌బాల్ మైదానాలు, ఇళ్ళు నిర్మించి ఇచ్చాడు. దాంతో ఆ పట్టణాల స్థానికుల్లో అతనికి మంచి ప్రాచుర్యం లభించింది. ఎస్కోబార్‌కు అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యల కారణంగా, కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా పేరుగాంచింది, ఎస్కోబార్‌ను పట్టుకోవడానికి కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి.[5] 1993లో ఎస్కోబార్‌ని అతని 44వ పుట్టినరోజుకు ఒకరోజు తర్వాత స్వంత పట్టణంలో కొలంబియన్ నేషనల్ పోలీసులు కాల్చిచంపారు.

తొలినాళ్ళ జీవితం

ఎస్కోబార్ ఎదిగి, నేర జీవితాన్ని ప్రారంభించిన మెడెలిన్ నగరం.

పాబ్లో ఎమిలో ఎస్కోబార్ గెవెరియా 1949 డిసెంబరు 1న కొలంబియాలో రియోనెగ్రోలో జన్మించాడు. అబెల్ డె జీసస్ డారి ఎస్కోబార్ (1910-2001), హెమిల్డా దంపతుల ఏడుగురు సంతానంలో మూడవ వాడు.[6][7] తండ్రి రైతు, తల్లి ప్రాథమిక ఉపాధ్యాయురాలు.[8] సమీపంలోని మెడెలిన్ అనే నగరంలో ఎస్కోబార్ పెరిగాడు. టీనేజి వయసులోనే నేరాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో సమాధి రాళ్ళు దొంగిలించి, స్థానిక స్మగ్లర్ల ద్వారా తిరిగి అమ్మేవాడు. అతని సోదరుడు రాబర్టో ఎస్కోబార్ దీన్ని ఖండించాడు. తమవారి సమాధుల నిర్వహణకు శ్మశానాల యజమానులకు కొందరు డబ్బు ఇవ్వడం ఆపేస్తూ ఉంటారని, అలాంటి సందర్భంలో వారికి సంబంధించినవారి సమాధి రాళ్ళు తీసి శ్మశానాల యజమానులు అమ్మేసేవారనీ, వారి నుంచే చట్టబద్ధంగా రాళ్ళను తెచ్చుకునేవారమనీ రాబర్టో చెప్పాడు. ఎస్కోబార్‌ల బంధువు ఒకరికి ఇటువంటి సమాధిరాళ్ళు అమ్మే వ్యాపారం ఉండడంతో అతనికి తాము అమ్మేవారమనీ అన్నాడు.[9] నకిలీ ఉన్నత పాఠశాల డిప్లొమా సర్టిఫికెట్లు తయారుచేసి అమ్మడంతో తన తండ్రి నేరజీవితం మొదలైందని ఎస్కోబార్ కుమారుడు సెబాస్టియన్ మారోక్విన్ అన్నాడు.[4] ఇవి ఎక్కువగా యూనివర్శిడాడ్ అటానొమా లాటినో అమెరికన్ ఆఫ్ మెడెలిన్ అనే విశ్వవిద్యాలయానికి చెందిన డిప్లొమోలు. ఈ విశ్వవిద్యాలయంలోనే ఎస్కోబార్ కొన్నాళ్ళు చదువుకున్నాడు.[10]

ఆస్కార్ బెనెల్ ఆగుయిర్ అనే వ్యక్తితో కలిసి ఎస్కోబార్ చిన్న చిన్న వీధి మోసాలు, నిషిద్ధ సిగరెట్లు అమ్మడం, తప్పుడు లాటరీ టిక్కెట్లు అంటగట్టడం, కార్ల దొంగతనం వంటి పలు నేరాలు చేసేవాడు.[11] 1970ల తొలినాళ్ళలో మాదక ద్రవ్యాల వ్యాపారంలో దిగి అందులో ఎస్కోబార్ దొంగలా, బాడీగార్డులా పనిచేశాడు. మెడెలిన్ నగరంలోని ఎగ్జిక్యూటివ్‌ని కిడ్నాప్ చేసి, విడుదల చేయడానికి లక్ష అమెరికన్ డాలర్లు డిమాండ్ చేసి సంపాదించుకున్నాడు.[12] మెడెలిన్‌ నగరంలో కార్యకలాపాలు చేస్తున్న ఆల్వారో ప్రీటో అన్న నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారు వద్ద పనిలో చేరాడు. తనకు 22 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఏదోక విధంగా పది లక్షల కొలంబియన్ డాలర్లు సంపాదించాలని ఎస్కోబార్‌కి చిన్ననాటి నుండి కల ఉండేది. ప్రీటో దగ్గర పనిలో చేరింది అందుకే.[13] 26 ఏళ్ళు వచ్చేసరికి 100 మిలియన్ కొలంబియన్ డాలర్లు బ్యాంకులో డిపాజిట్ చేసి చాలా ప్రఖ్యాతి చెందాడు. ఈ సొమ్ము అమెరికన్ డాలర్లలో లెక్కిస్తే అప్పటికి మూడు మిలియన్ డాలర్ల కన్నా పెద్ద మొత్తం.[14]

నేర జీవితం

కొకైన్ పంపిణీ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మార్గాలు.

1975 మొదట్లో ఎస్కోబార్ పలుమార్లు కొలంబియా, పనామాల నడుమ అమెరికాలోకి మాదక ద్రవ్యాలు చేర్చే మార్గాల్లో విమాన ప్రయాణాలు చేసి తనదైన కొకైన్ అక్రమరవాణా మార్గాన్ని ఏర్పరుచుకున్నాడు. తర్వాత లేర్‌జెట్ సహా 15 పెద్ద విమానాలు, ఆరు హెలీకాఫ్టర్‌లు కొనుగోలు చేశాడు. వీటిని అక్రమరవాణాకు ఉపయోగించేవాడు.1976 మే నెలలో ఎస్కోబార్, అతని అనుచరులు ఈక్వడార్ నుండి భారీ లోడ్‌తో మెడెలిన్ నగరానికి వస్తూండగా పోలీసులు అరెస్టు చేసి 15 కేజీల వైట్‌పేస్టును స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఎస్కోబార్ ఈ కేసును విచారిస్తున్న మెడెలిన్ నగరపు న్యాయమూర్తులకు లంచం ముట్టజెప్పి తప్పించుకుందామని ప్రయత్నించి, విఫలమయ్యాడు. అనేక నెలల పాటు కేసు నడుస్తూండగా అరెస్టు చేసిన ఇద్దరు ఆఫీసర్ల హత్యచేయించాడు. తర్వాత ఆ కేసు మూసివేశారు.[15]

అప్పటికి ఇతర నిషిద్ధ వస్తువుల వ్యాపారం మరీ ప్రమాదకరంగా మారడంతో పాబ్లో ఎస్కోబార్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎంచుకున్నాడని అతని కుమారుడు, జీవిత చరిత్రకారుడు రాబర్టో ఎస్కోబార్ పేర్కొన్నాడు. డ్రగ్ కార్టెళ్ళు అసలే లేకపోవడం, డ్రగ్ బారన్లు కొద్ది మంది మాత్రమే ఉండడం గమనించిన ఎస్కోబార్ ఇది ఇంతవరకూ ఎవరూ సరిగా ముట్టుకోని రంగం అని అర్థం చేసుకుని ఈ రంగాన్ని తనది చేసుకోవాలనుకున్నాడు. పెరూలో కోకైన్ పేస్టు కొని మెడలీన్‌లో దాన్ని శుద్ధి చేసి అమ్మేవాడు. మొట్టమొదటి సారిగా పెరూలో 14 కేజీల పేస్టును కొనుగోలు చేశాడు. తన నేర సామ్రాజ్య స్థాపనలో అది తొలి మెట్టు. తొలినాళ్ళలో పాత టైర్లలో పెట్టి కొకైన్ అక్రమంగా రవాణా చేసేవాడు. తీసుకుపోయిన పైలెట్‌కి ఒక్కొక్క ప్రయాణానికి 5 లక్షల అమెరికన్ డాలర్ల దాకా ఇచ్చేవాడు.[16]

ప్రాధాన్యత సంపాదించడం

పాబ్లో ఎస్కోబార్, అతని అనుచరులు కలిసి పౌడర్ కొకైన్ తయారుచేసి అమ్మేవారు. దీన్నే యునైటెడ్ స్టేట్స్ మాదకద్రవ్యాల మార్కెట్ ద్వారా పంపిణీ చేసేవారు.

కొన్నాళ్ళకే అమెరికాలో కొకైన్ డిమాండ్ ఆకాశాన్ని తాకింది. ఎస్కోబార్ తన అక్రమరవాణా కార్యకలాపాలు, మార్గాలు, సౌత్ ఫ్లోరిడా, కాలిఫోర్నియా, ఇతర అమెరికా ప్రాంతాల్లో పంపిణీ నెట్‌వర్కులు మరింత వేగంగా పెంపొందించాడు. అతను, అతనితో పాటుగా కార్టెల్ ప్రారంభించిన కార్లోస్ లెహ్‌డెర్ కలిసి ఫ్లోరిడా తీరానికి 220 మైళ్ళ ఆగ్నేయంగా బహమాస్‌లోని నార్మన్స్ క్లే అన్న ద్వీపాన్ని ఈ పంపిణీ మార్గంలో కీలకమైన స్థానంగా రూపొందించుకున్నారు. ఇతని సోదరుడి సమాచారం ప్రకారం ఎస్కోబార్ నార్మన్స్ క్లే ద్వీపాన్ని కొనుగోలు చేయలేదు. లెహ్‌డర్ కొన్నాడు. దాదాపు ఆ ద్వీపంలోని భూమినంతా కొనేశారు. అందులో ఎయిర్‌స్ట్రిప్, ఓడరేవు, హోటల్, ఇళ్ళు, బోట్లు, విమానం వంటివి ఉండేవి. వారు తమ కొకైన్ భద్రపరచడానికి శీతల గోడౌను కూడా నిర్మించుకున్నారు.

1978 నుంచి 1982 వరకూ మెడెలిన్ కార్టెల్‌కి ఇదే ముఖ్యమైన అక్రమరవాణా మార్గంగా ఉండేది. ఈ మార్గం ద్వారా విపరీతమైన లాభాలు గడించిన ఎస్కోబార్ కొన్నాళ్ళకే ఆంటియోకియాలో 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూమిని లక్షలాది డాలర్ల విలువకు కొనగలిగాడు. అక్కడ విలాసవంతమైన హసీండా నేపుల్స్ (అనువాదం- నేపుల్స్ ఎస్టేటు) నిర్మించుకున్నాడు. అతని విలాసవంతమైన ఇంటిలో ఒక జంతుప్రదర్శనశాల, ఒక సరస్సు, శిల్పాలతో కూడిన తోట, ప్రైవేట్ బుల్‌రింగ్ వంటి వినోదాలు ఉండేవి. అందులో అతను కుటుంబంతోనూ, కార్టెల్ సిబ్బందితోనూ సరదాగా గడిపేవాడు.[17]

ఎస్కోబార్ నిర్మించుకున్న ప్రైవేట్ ఎస్టేట్ హసీండా నేపుల్స్‌లో ఆక్టోపస్ థీమ్ ఈతకొలను

ఒక సమయంలో ఎస్కోబార్ నెలనెలా 70 నుంచి 80 టన్నుల కొకైన్ అమెరికాకు కొలంబియా నుంచి అక్రమరవాణా చేస్తున్నట్టు అంచనావేశారు.[18] 1980ల మధ్యకాలంలో ఎస్కోబార్ శక్తి, అధికారం శిఖరాన్ని అందుకున్నప్పుడు, మెడెలిన్ కార్టెల్ జెట్‌లైనర్స్ ద్వారా ఒక్కో విమానంలో 11 టన్నుల చొప్పున అమెరికాకు రవాణా చేస్తూండేది. (ఎస్కోబార్ చేసిన అతిపెద్ద లోడు 23 వేల కేజీల కొకైన్ ఫిష్ పేస్టులో కలిపి చేసిన షిప్‌మెంట్. దీన్ని ఒక బోటులో పంపించాడు. ఈ విషయం అతని సోదరుడు రాసిన ఎస్కోబార్ పుస్తకంలో నిర్ధారితం) రాబర్టో ఎస్కోబార్ చెప్పినదాని ప్రకారం, విమానాలతో పాటుగా పాబ్లో ఎస్కోబార్ భారీ లోడ్ పంపించడానికి రెండు చిన్న సబ్‌మెరైన్‌లను కూడా వినియోగించాడు.[19]

వ్యవస్థాపితమైన మాదకద్రవ్యాల నెట్‌వర్క్

1982లో లిబరల్ ఆల్టర్నేటివ్ అనే చిన్న ఉద్యమంలో భాగంగా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కొలంబియాకు ప్రత్యామ్నాయ సభ్యునిగా ఎస్కోబార్ ఎన్నికయ్యాడు. ఎన్నికై ఛాంబర్‌లో అడుగుపెట్టిన రోజే ఎస్కోబార్ నేర జీవితానికి సాక్ష్యాలు చూపుతూ, అతని అభ్యర్థిత్వాన్ని లిబరల్ రెన్యువల్ పార్టీ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి లూయీస్ కార్లోస్ గాలేన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో ఎస్కోబార్ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నాడు.[20][21] ఫెలిప్ గోన్జెలెజ్ స్పెయిన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు, ఆ కార్యక్రమానికి ఎస్కోబార్ కొలంబియన్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగా కూడా హాజరయ్యాడు.[22]

అతని మాదకద్రవ్యాల వ్యవస్థ ప్రాచుర్యం పొందుతూండడంతో ఎస్కోబార్ అంతర్జాతీయంగా పేరుపొందాడు; అమెరికా, మెక్సికో, ప్యూర్టోరికో, డొమినికన్ రిపబ్లిక్, వెనుజులా, స్పెయిన్ దేశాల్లోకి ప్రవేశించే మాదకద్రవ్యాల్లో సింహభాగం మెడెలిన్ కార్టెల్ నియంత్రణలో ఉండేది. ఉత్పత్తి చేసే పద్ధతి కూడా మారింది; అంతకుముందు బొలీవియా, పెరూ దేశాల్లో పండించిన కోకాతో తయారుచేస్తూండగా, ఈ దశలో కొలంబియా కోకా నుంచి ఉత్పత్తి జరిగేది. కొలంబియా కోకా నుంచి తయారైన కొకైన్ చుట్టుపక్కల దేశాల కోకా నుంచి ఉత్పత్తి అయ్యేదాని కన్నా ఎక్కువ నాణ్యత ఉన్నదన్న పేరు కూడా రావడం మొదలైంది. మరింత నాణ్యమైన, మరింత ఎక్కువ కొకైన్ కోసం డిమాండ్ పెరిగేకొద్దీ ఎస్కోబార్ తన అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయాడు. బొలీవియన్ కొకైన్ కింగ్ అయిన రాబర్టో సూరెజ్ గోమేజ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించి ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా ఖండాల్లోని వివిధ దేశాలకు విస్తరించాడు. ఇతని అక్రమరవాణా సుదూరాన ఆసియా ఖండం వరకూ విస్తరించిందన్న పుకార్లూ ఉండేవి.

ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ ముట్టడి

1985 నాటి కొలంబియన్ సుప్రీంకోర్టు దాడి విషయంలో ఎస్కోబార్ నేరుగా బాధ్యుడని పలు పత్రికా ప్రచురణలు భావించాయి.

1985లో M-19 అనే ఉద్యమానికి సంబంధించిన వామపక్ష గెరిల్లాలు చేసిన కొలంబియన్ సుప్రీంకోర్టు ముట్టడి వెనుక ఎస్కోబార్ ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్‌తో కొలంబియా నేరస్థుల అప్పగింత ఒప్పందపు రాజ్యాంగబద్ధతను అధ్యయనం చేసినందుకు నిరసనగా ఈ ముట్టడి జరిగింది. దీని ఫలితంగా కోర్టులోని న్యాయమూర్తుల్లో సగం మంది హత్యకు గురయ్యారు.[23] కొలంబియన్ ప్రభుత్వం నేరస్థుల అప్పగింత కింద అమెరికాకి బదిలీ చేసే అవకాశం ఉన్న కొకైన్ అక్రమరవాణాదారులను లాస్ ఎక్స్ట్రాడిటబుల్స్ అని పిలిచేవారు. వీరిలో ఎస్కోబార్ ఒకడు. M-19 దళానికి ప్యాలెస్ ముట్టడించి తమ గురించిన పత్రాలు, సాక్ష్యాలు తగలబెట్టేందుకు కొకైన్ అక్రమరవాణాదారులు డబ్బు ఇచ్చారు. M-19 దళం ప్యాలెస్ ఆఫ్ జస్టిస్‌ని ముట్టడించి ప్రణాళిక ప్రకారం లాస్ ఎక్స్ట్రాడిటబుల్స్కు సంబంధించిన పత్రాలు తగులబెడుతూ ఆ విషయం బయటపడకుండా భవనంలో కొంతభాగాన్ని తగలబెట్టారు. ఈ ముట్టడిలోనూ, దీనిపై సైన్యం జరిపిన చర్యలోనూ ప్యాలెస్ ఆఫ్ జస్టిస్‌లో సగం మంది న్యాయవాదులు చనిపోయారు.

శిఖరాయమానమైన స్థితిలో ఎస్కోబార్

ఎస్కోబార్ కార్యకాలాపాలు శిఖరాయమానమైన స్థితిలో ఉండగా మెడెలిన్ కార్టెల్‌కు రోజుకు 70 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు సంవత్సరానికి 26 బిలియన్ అమెరికన్ డాలర్లు వచ్చేవి. రోజూ 50 మిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం అమెరికాలోనే జరిగేది. కొకైన్ అక్రమరవాణా ద్వారా ఎస్కోబార్ సంపాదించిన డబ్బు ఎంత ఉండేదంటే, వారానికి వెయ్యి అమెరికన్ డాలర్లు కేవలం డబ్బుకట్టలు కట్టడానికి వాడే రబ్బర్ బ్యాండ్లు కొనడానికే ఖర్చయ్యేది. సొమ్మునంతటినీ గోడౌన్లలో దాచేవారు. ఈ సొమ్ములో ఏడాదికి పదిశాతం వరకూ ఎలుకలు కొరికిపారెయ్యడం వల్ల పాడైపోయేది.[13]

1989లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎస్కోబార్ వ్యక్తిగత ఆస్తుల విలువ 3 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనావేసి, ప్రపంచవ్యాప్తంగా 227 మంది అత్యంత సంపన్న బిలియనీర్లలో ఒకడిగా లెక్కించింది.[24] ఈ కాలంలో అతని మెడెలిన్ కార్టెల్ ప్రపంచవ్యాప్తంగా కొకైన్ మార్కెట్‌లో 80 శాతాన్ని నియంత్రిస్తూ ఉంది.[19][25][26] దక్షిణ అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన కోపా లిబెర్టడరెస్‌ను 1989లో గెలుచుకున్న మెడెలిన్ నగరపు అట్లెటికో నేషినల్ క్లబ్ వెనుక ప్రధాన పెట్టుబడిదారు ఎస్కోబార్ అని నమ్మేవారు.[27]

ఎస్కోబార్‌ని అమెరికా, కొలంబియా ప్రభుత్వాలు శత్రువుగా చూస్తూన్న కాలంలో మెడిలిన్ నగరంలో చాలామంది, ప్రత్యేకించి పేదవారు, ఎస్కోబార్‌ని హీరోగా చూడసాగారు. అతను చాలా సహజంగా, ప్రజలతో కలిసిపోతూ ఉండేవాడు. కొలంబియాలోని పేదల్లో మంచి పేరు వచ్చే పలు కార్యక్రమాలు చేపట్టాడు. స్వతహాగా క్రీడాభిమాని అయిన ఎస్కోబార్ ఫుట్‌బాల్ మైదానాలు, పలు ఆటలకు వీలైన క్రీడామైదానాలు నిర్మించడం, బాలల ఫుట్‌బాల్ జట్టులను స్పాన్సర్ చేయడం వంటి పనులు చేశాడు.[13] పశ్చిమ కొలంబియాలో ఇళ్ళు, ఫుట్‌బాల్ మైదానాలు నిర్మించాడు, తద్వారా పేదల్లో మంచి పేరు సంపాదించాడు.[28][29][30] అతను చేసిన పలు ప్రయత్నాల వల్ల ఉన్నవారిని కొట్టి పేదవారికి పెట్టే రాబిన్ హుడ్ ఇమేజి లభించింది. తరచు ఇళ్ళ నిర్మాణాలు, పేదల్లో మంచిపేరు వచ్చే పలు కార్యకలాపాలు చేపట్టేవాడు. మెడలిన్‌లో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కాపలా కాయడం అధికారులకు ఎస్కోబార్‌కు సంబంధించిన వివరాలు చెప్పకుండా దాచడం వంటి పనులతో ఇతన్ని పోలీసులకు దొరకకుండా సాయపడ్డారు. ఇతని కార్యకలాపాలు శిఖరాయమానంగా ఉండగా మెడెలిన్ నగరంలో మాత్రమే కాక ఇతర ప్రాంతాలకు కూడా చెందిన మాదకద్రవ్యాల రవాణాదారులు ఇతనికి తమ కొలంబియన్ కొకైన్ సంబంధిత లాభాల్లో 20 నుంచి 35 శాతం వాటాలు ఇచ్చేసేవారు. బదులుగా ఇతను విజయవంతంగా అమెరికాకు కొకైన్ సరఫరా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకునేవాడు.[31]

కొలంబియన్ కార్టెల్స్ తమలో తాము ఆధిపత్యం కోసం చేసిన పోరాటాలు అత్యంత రక్తసిక్తమయ్యాయి. దీని ఫలితంగా 1991లో 25,100 హత్యలు, 1992లో 27,100 హత్యలతో కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా నిలిచింది.[32] తన వద్ద పనిచేసే హిట్‌మెన్‌కి పోలీసు అధికారులను చంపడానికి ఎస్కోబార్ రివార్డులు ప్రకటించడంతో 600 మంది పోలీసు అధికారులు చనిపోయారు. ఇటువంటి చర్యలు కొలంబియాలో హత్యల నిష్పత్తి భారీగా పెంచేశాయి.[5]

లా కాటెడ్రల్ జైలు

మాదకద్రవ్యాల కార్టెల్స్‌కు వ్యతిరేకంగా పనిచేసిన కొలంబియన్ రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు లూయీస్ కార్లోస్ గాలాన్‌ పదివేలమంది ఎదుట ప్రసంగిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య పాబ్లో ఎస్కోబార్ చేశాడని భావించారు. సీజర్ గావిరియా ప్రభుత్వం ఎస్కోబార్‌కీ, మాదకద్రవ్యాల కార్టెల్స్‌కీ వ్యతిరేకంగా చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వం ఎస్కోబార్‌తో చర్చలు సాగించింది. అతను పోలీసులకు లొంగిపోయి, తన నేర కార్యకలాపాలు అన్నిటినీ కట్టిపెట్టేట్టు, అందుకు బదులుగా ప్రభుత్వం ఎస్కోబార్ శిక్ష తగ్గించేట్టు, ఖైదీగా ఉన్నకాలంలో తనకు అనుకూలంగా వ్యవహరించేట్టు ఇరుపక్షాల నడుమ అంగీకారం కుదిరింది. అధికారులు, ప్రజాభిప్రాయం నుంచి వస్తూన్న ఒత్తిడికి దిగివచ్చి వరుస హింసాత్మక చర్యలకు ముగింపు పలుకుతూ 1991లో ఎస్కోబార్ కొలంబియన్ అధికారులకు లొంగిపోయాడు. ఇతను లొంగిపోయే ముందే కొలంబియన్ పౌరులను యునైటెడ్ స్టేట్స్‌కు నేరస్థుల అప్పగింత కింద బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ కొత్తగా ఆమోదించిన 1991 నాటి కొలంబియన్ రాజ్యాంగం చట్టం చేసింది. ఎస్కోబార్, ఇతర మాదకద్రవ్యాల నేరసామ్రాజ్య నేతలు రాజ్యాంగ సభ సభ్యులను ప్రభావితం చేసి ఈ చట్టం రూపొందించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫుట్‌బాల్ పిచ్, పెద్ద బొమ్మ ఇల్లు, జకుజ్జీ, జలపాతంతో కూడిన లా కాటెడ్రల్ అన్న విలాసవంతమైన స్వంత జైలు రూపొందించుకుని నిర్బంధాన్ని అనుభవించసాగాడు. ఎస్కోబార్ తన నేర కార్యకలాపాలను స్వంత జైలు నుంచే సాగిస్తున్నాడన్న వార్తలు పత్రికా మాధ్యమాల్లో రాసాగాయి. దాంతో ప్రభుత్వం 1992 జూలై 22న అతనిని సాధారణమైన జైలుకు తరలించాలని నిర్ణయించింది. ఎస్కోబార్ తన పలుకుబడితో ఈ జైలు బదిలీ ప్రణాళిక ముందే తెలిసుకుని, సకాలంలో తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్న తర్వాత ఎస్కోబార్ తన మిగిలిన జీవితాన్ని పోలీసుల వేట నుంచి తప్పుకుంటూ రహస్యంగా గడిపాడు.[33][34]

కొలంబియన్, అమెరికన్ పోలీసుల వేట

ఎస్కోబార్ నిర్బంధం నుంచి తప్పించుకున్నాకా అమెరికా ప్రత్యేక జాయింట్ ఆపరేషన్స్ కమాండ్, సెంట్రా స్పైక్ కలిసి ఇతన్ని వేటాడసాగాయి. వారు సెర్చ్ బ్లాక్ (అన్వేషణ కూటమి) అనే ప్రత్యేక కొలంబియన్ పోలీస్ టాస్క్‌ఫోర్స్‌కు శిక్షణ ఇచ్చారు. ఎస్కోబార్‌కీ, అమెరికా-కొలంబియా ప్రభుత్వాలకీ నడుమ ఘర్షణ అంతూపొంతూ లేకుండా సాగుతూ పోయింది. ఈలోగా బాహాటంగా ఎస్కోబార్‌ని పట్టుకునే ప్రయత్నాలకు మద్దతునిచ్చే అతని శత్రువుల సంఖ్యా పెరగసాగింది. లోస్ పెపెస్ (పాబ్లో ఎస్కోబార్ వల్ల హింసింపబడ్డ జనం అన్న పదబంధపు స్పానిష్ అనువాదానికి కుదింపబడ్డ రూపం) అన్న పేరుతో ఎస్కోబార్‌ని పట్టుకునే ప్రయత్నాలకు సహకరించే అతని శత్రువులతో ఒక నిఘాసంఘం ఏర్పాటైంది. ఈ నిఘా సంఘం కార్యకలాపాలకు ఎస్కోబార్ ప్రత్యర్థులు, పూర్వ అనుచరులూ ఆర్థికంగా సహాయం చేసేవారు. వారిలో కాలి కార్టెల్, కార్లోస్ కాస్టనో ఆధ్వర్యంలోని సంప్రదాయవాద పారామిలిటరీలూ ఉన్నారు. లాస్ పెపెస్ కార్యకలాపాలు ప్రతీకారం లక్ష్యంగా రక్తసిక్తంగా ఉండేవి. ఈ నిఘాసంఘం ఎస్కోబార్ న్యాయవాదిని, [35] బంధువులను, సహచరులను దాదాపు మూడువందల మందిని హత్యచేసింది. మెడెలిన్ కార్టెల్ సంపాదించిన ఆస్తులు పెద్దమొత్తంలో నాశనం చేశారు.

సెర్చ్ బ్లాక్ సభ్యులు, కొలంబియన్, యునైటెడ్ స్టేట్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ఎస్కోబార్‌ను పట్టుకునే ప్రయత్నాలలో అయితే లోస్ పెపెస్‌తో కుమ్మక్కు అయ్యారు. వాళ్ళు ఒక్కోసారి సెర్చ్ బ్లాక్‌లా, ఒక్కోసారి లోస్ పెపెస్‌ పేరిట తమ పనులు చేపట్టేవారు. యుఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు మిగిలిన ఎస్కోబార్ సహచరులను, స్నేహితులను అణచివేయడానికి, దెబ్బతీయడానికి రహస్య పద్ధతిలో లోస్ పెపెస్కి సమాచారాన్ని అందించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒక్కోసారి సెర్చ్ బ్లాక్ సభ్యులు నేరుగా లోస్ పెపెస్ హత్యాకాండల్లో పాల్గోవడమూ ఉండేది.[29][page needed] లాస్ పెపెస్ నాయకుల్లో ఒకరైన డీగో మూరిలో బెజరనో (డాన్ బెర్నాగా ప్రసిద్ధుడు) మొదట్లో మెడెలిన్ కార్టెల్ సభ్యునిగా ఉండేవాడు. తర్వాత మాదకద్రవ్యాల రవాణా మార్గపు నాయకుడైనాడు. క్రమేపీ లాస్ పెపెస్‌లో చేరి, ఆ తర్వాత కొలంబియా స్వీయ రక్షణ వ్యవస్థలో బలమైన భాగానికి నాయకుడయ్యాడు.

మరణం

1993 డిసెంబరు 2న ఎస్కోబార్ మృతదేహం ముందు సంబరాలు జరుపుకుంటున్న సెర్చ్ బ్లాక్ సభ్యులు. వందల మిలియన్ డాలర్ల ఖర్చుతో 16 నెలల పాటు సాగిన వేట ఇతని మరణంతో ముగిసింది.
ఇటాగుయ్‌లో మాంటె సాక్రో శ్మశానంలో ఎస్కోబార్, అతని కుటుంబ సభ్యుల సమాధి

లా కాటెడ్రల్ నుంచి తప్పించుకున్న 16 నెలల తర్వాత సెర్చ్ బ్లాక్‌ నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నాల మధ్య 1993 డిసెంబరు 2న జరిగిన కాల్పుల్లో పాబ్లో ఎస్కోబార్ చనిపోయాడు.[36] బ్రిగేడియర్ హ్యూగో మార్టినెజ్ నేతృత్వంలోని కొలంబియన్ ఎలక్ట్రానిక్ నిఘాదళం [37] ఇతని రేడియోటెలిఫోన్ ప్రసారాలను రేడియో ట్రైలిటరేషన్ సాంకేతికత ఉపయోగించి జాడలుపట్టి మెడెలిన్ నగరంలోని లాస్ ఓలివాస్ అనే మధ్యతరగతి ప్రాంతంలో వెతికిపట్టుకున్నారు. ఎస్కోబార్, అతని అంగరక్షకుడు అల్వారో డె జెసుస్ ఆగుడెలో (అలియాస్ ఎల్ లిమోన్) లకు, అధికారులకు నడుమ కాల్పులు జరిగాయి. ఒకదాన్నొకటి అంటుకున్న ఇళ్ళ కప్పుల మీద ఇద్దరూ పరుగులు పెడుతూ వెనుక సందుకు చేరి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరినీ వెంబడిస్తున్న కొలంబియన్ జాతీయ పోలీసు అధికారులు కాల్చిచంపారు.[38] ఎస్కోబార్ కాళ్ళు, మొండెం మీద బుల్లెట్ గాయాలయ్యాయి. చెవి నుంచి తలలోకి పోయిన బుల్లెట్ ప్రాణం తీసింది.

చెవి లోంచి పోయిన బుల్లెట్ షాట్ ఎవరు కాల్చారన్న విషయం నిర్ధారితం కాలేదు, అలానే ఈ గన్ షాట్ కాల్పుల సమయంలోనే తగిలిందా లేక తర్వాత పట్టుకుని కాల్చారా అన్న విషయమూ స్పష్టం కాలేదు. ఈ విషయం మీద పలు ఊహాగానాలు ఉన్నాయి. కొందరు ఎస్కోబార్ బంధువులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని నమ్ముతారు.[39] అతని ఇద్దరు సోదరులు రాబర్టో ఎస్కోబార్, ఫెర్నాండో సాంకెజ్ ఆరెలనో తనను తానే చెవిలోంచి తలలోకి కాల్చుకున్నాడని నమ్ముతున్నారు. ఈ అంశం మీద ఒక వాంగ్మూలంలో వారిద్దరూ పాబ్లో ఎస్కోబార్ "ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాని కాల్చిచంపితే చావలేదు. వాళ్లందరూ అతని వెనుక పడిన సంవత్సరాల కాలంలో ప్రతీరోజూ మాతో తననే గనుక చుట్టుముడితే, వేరే దారి లేదని తేలితే నన్ను నేనే చెవిలోంచి కాల్చుకుంటానని చెప్పేవాడు" అన్నారు.[40][page needed]

ప్రాచుర్యం

పుస్తకాలు

ఎస్కోబార్ గురించి అనేక పుస్తకాలు వచ్చాయి, వాటిలో కొన్ని ఇవి:

  • ఎస్కోబార్ (2010): అతని సోదరుడు రాబర్టో ఎస్కోబార్ ఈ పుస్తకం రాశాడు. ఇందులో ఎస్కోబార్ ఉత్థాన పతనాలు అక్షరబద్ధం చేశాడు.[41]
  • ఎస్కోబార్ గవేరియా, రాబర్టో (2016). మై బ్రదర్ - పాబ్లో ఎస్కోబార్. Escobar. inc. ISBN 978-0692706374.
  • కింగ్స్ ఆఫ్ కొకైన్ (1989): గుయ్ గుగ్లియొట్టా రాసిన పుస్తకం. దీనిలో మెడెలిన్ కార్టెల్ చరిత్ర, పనిచేసిన పద్ధతి, దానిలో ఎస్కోబార్ పాత్ర వివరించాడు.[42]
  • కిల్లింగ్ పాబ్లో: ద హంట్ ఫర్ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఔట్‌లా (2001): మార్క్ బౌడెన్ రాసిన పుస్తకం.[43][44] అమెరికా ప్రత్యేక దళాలు, నిఘావర్గం, కొలంబియన్ సైన్యం, లాస్ పెపెస్ వర్గాలు ఎస్కోబార్‌ని చంపి, అతని కార్టెల్‌ని నాశనం చేయడానికి ఏమేం చేశారో కిల్లింగ్ ఎస్కోబార్ పుస్తకంలో రాశాడు.[45]
  • పాబ్లో ఎస్కోబార్: మై ఫాదర్ (2016): ఎస్కోబార్ కొడుకు జువాన్ పాబ్లో ఎస్కోబార్ రాసిన ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి ఆంద్రె రోసెన్‌బర్గ్ అనువదించాడు.[46]
  • పాబ్లో ఎస్కోబార్: బియాండ్ నార్కోస్ (2016): షువాన్ ఆట్‌వుడ్ రాశాడు; ISBN 978-1537296302
  • అమెరికన్ మేడ్: హూ కిల్డ్ బెర్రీ సీల్? పాబ్లో ఎస్కోబార్ ఆర్ జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్ (2016): షువాన్ ఆట్‌వుడ్ రాసిన పుస్తకంలో సీఐఎ విమానచోదకుడు బెర్రీ సీల్ హత్య పాబ్లో ఎస్కోబార్ చేశాడన్న అనుమానం, ఆ విషయంలో నిజానిజాల పరిశీలన కనిపిస్తుంది; ISBN 978-1537637198
  • లవింగ్ పాబ్లో, హేటింగ్ ఎస్కోబార్ (2017): కొలంబియన్ పాత్రికేయురాలు, టెలివిజన్ యాంకర్ వర్జీనియా వాలెజో రాసింది. ఈ పుస్తకంలో ఆమె తనకు పాబ్లోకి ఉన్న శృంగార అనుబంధం గురించి మొదలుకొని కొలంబియాలో కొకైన్ అక్రమ రవాణా వ్యాపారం ఎలా మొదలైంది, ఎలా వర్ధిల్లిందన్న విషయం వరకూ పలు అంశాలను వివరించింది. ఈ పుస్తకం 16 భాషల్లోకి అనువాదం అయింది.

సినిమాలు

2007లో ఎస్కోబార్ జీవితం ఆధారం చేసుకుని సినిమా తీస్తామని రెండు వేర్వేరు సంస్థలు ప్రకటించాయి. వీటిలో ఒకటి ఎస్కోబార్, మరొకటి కిల్లింగ్ పాబ్లో.[47] ఈ రెండు సినిమాలూ వేర్వేరు కారణాల వల్ల విడుదల కాలేదు. ఎస్కోబార్ సినిమా నిర్మాత ఆలివర్ స్టోన్ జార్జ్ డబ్ల్యు. బుష్ జీవితంపై డబ్ల్యు. అన్న సినిమాతో బిజీ కావడంతో ఎస్కోబార్ సినిమా పూర్తికాలేదు.[48] కిల్లింగ్ పాబ్లో అన్న సినిమా అదే పేరుతో వచ్చిన పుస్తకాన్ని ఆధారం చేసుకుని జో కార్నహాన్ దర్శకత్వంలో నిర్మించాలని ప్రయత్నించారు.[44][45] క్రిస్టియన్ బాలె ఒక ముఖ్యపాత్రలోనూ, వెనెజులన్ నటుడు ఎడ్గార్ రామీరెజ్ ఎస్కోబార్ పాత్రలోనూ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 2008 డిసెంబరులో కిల్లింగ్ పాబ్లో నిర్మాత బాబ్ యారీ దివాలా తీసినట్టు ప్రకటించాడు. అంతటితో ఆ సినిమా ఆగిపోయింది.[49][50] ఇవి కాక మరికొన్ని సినిమాలు కూడా పాబ్లో ఎస్కోబార్ జీవితం ఆధారం చేసుకున్నాయి:

  • పాబ్లో ఎస్కోబార్: ద కింగ్ ఆఫ్ కొకైన్ (2007) అన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ నిర్మించి టీవీలో ప్రసారం చేసింది. దీనిలో ఎస్కోబార్ జీవితంతో సంబంధం ఉన్న పలువురి వ్యాఖ్యానాలు, ఆర్కైవ్ ఫుటేజీ ఉన్నాయి.[51][52]
  • ఎస్కోబార్: పారడైజ్ లాస్ట్ అన్న సినిమాలో కెనడియన్ సర్ఫర్ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతకీ ఆ అమ్మాయి పాత్ర సినిమా ప్రకారం ఎస్కోబార్ మేనకోడలు.
  • లవింగ్ పాబ్లో అన్న 2017 నాటి స్పానిష్ సినిమా వర్జీనియా వాలెజో రాసిన లవింగ్ పాబ్లో, హేటింగ్ ఎస్కోబార్ పుస్తకం ఆధారంగా తీసినది. పాబ్లో ఎస్కోబార్‌గా జావియెర్ బార్డెమ్, వర్జీనియా వాలెజోగా పెనెలోప్ క్రూజ్ నటించారు.[53]
  • అమెరికన్ మేడ్ అన్న 2017 నాటి జీవితకథాత్మక చిత్రం. ఇది బారీ సీల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా. అతను మెడెలిన్ కార్టెల్‌కి మాదకద్రవ్యాల అక్రమరవాణా చేసేందుకు పనిచేసి, తర్వాతికాలంలో దొరికిపోయి అమెరికన్ మాదకద్రవ్యాల నియంత్రణ ఏజెన్సీ (డీఎఎ)కి సహకరించినందుకు పాబ్లో ఎస్కోబార్ నియమించిన కిరాయి హంతకుల చేతిలో మరణించాడు. ఈ సినిమాలో ఎస్కోబార్ పాత్రలో మారిసియో మెజియా నటించాడు.[54]

టెలివిజన్

  • నార్కోస్ అన్న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ టెలివిజన్ సీరీస్ పాబ్లో ఎస్కోబార్ జీవితాన్ని ఆధారం చేసుకుని తీశారు. ఇది మొదట 2015 ఆగస్టు 28లో విడుదలైంది. బ్రెజిలియన్ నటుడు వాగ్నర్ మౌరా పాబ్లోగా నటించాడు.[55] రెండో సీజన్ 2016 సెప్టెంబర్ 2న విడుదలైంది.[56] నార్కోస్ మొదటి భాగం, రెండవ భాగాల్లో పాబ్లో ఎస్కోబార్ జీవితం చిత్రీకరించరించగా, మూడవ భాగంలో ఎస్కోబార్ మరణం తర్వాత ఇతర కార్టెల్స్ గురించి చూపించారు. సీరీస్ మంచి విజయాన్ని సాధించి, సానుకూల సమీక్షలు పొందింది.[57][58][59]
  • 2007లో ఎన్‌టూరేజ్ అన్న హెచ్‌బీవో టీవీ సీరీస్‌లో ఆడ్రియన్ గ్రెనైర్ ఒక సినీ నటుడి పాత్ర పోషించాడు. ఆ సినీ నటుడి పాత్ర మెడెలిన్ అన్న సినిమాలో ఎస్కోబార్ పాత్ర పోషిస్తున్నట్టుగా కథ సాగుతుంది.[60]
  • కారకల్ టీవీ పాబ్లో ఎస్కోబార్: ఎల్ పాట్రన్ డెల్ మాల్ అన్న టెలివిజన్ సీరీస్ నిర్మించి, 2012 మే 28న ప్రసారం ప్రారంభించింది. పాబ్లో ఎస్కోబార్ పాత్రలో ఆంద్రెస్ పర్రా నటించాడు.[61]
  • ఈఎస్‌పిఎన్ చానెల్ వారి 30 ఫర్ 30 సీరీస్ చిత్రాల్లో జెఫ్ జింబాలిస్ట్, మైఖేల్ జింబాలిస్ట్ దర్శకత్వం వహించిన ద టూ ఎస్కోబార్స్ (2010) కూడా ఒకటి. 1994 నాటి ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో కొలంబియా జట్టు ఆటను, కొలంబియాలో ఫుట్‌బాల్‌కీ, దేశంలోని నేరగాళ్ళ గ్యాంగ్‌లకు మధ్య ఉన్న సంబంధం, మరీ ముఖ్యంగా ఎస్కోబార్ నిర్వహించే మెడెలిన్ కార్టెల్‌కీ ఫుట్‌బాల్ క్రీడకీ ఉన్న సంబంధం, చూపించింది. సీరీస్ పేరులో కనిపించే మరో ఎస్కోబార్ కొలంబియన్ డిఫెండర్ ఆంద్రెస్ ఎస్కోబార్ (పాబ్లోతో సంబంధం ఏమీ లేదు), ఇతను సెల్ఫ్ గోల్ చేసి, తద్వారా జాతీయ జట్టు ఓటమికీ, 1994 ఫిఫా ప్రపంచకప్ నుంచి కొలంబియన్ జాతీయ జట్టు వైదొలగడానికి కారణమయ్యాడు.[62]
  • నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ వారు 2016లో ప్రసారం చేసిన ఫేసింగ్ అన్న జీవిత చరిత్రల సీరీస్‌లో ఒక ఎపిసోడ్‌లో పాబ్లో ఎస్కోబార్ జీవితం చూపించారు.[63]
  • 2005లో కోర్ట్ టీవీ (ప్రస్తుతం ట్రూటీవీగా పేరుమారింది) వారు ప్రసారం చేసిన మగ్‌షాట్స్ అనే డాక్యుమెంటరీ సీరీస్‌లో ఎస్కోబార్ గురించి ఒక ఎపిసోడ్ ఉంది. దాని పేరు పాబ్లో ఎస్కోబార్ - హంటింగ్ ద డ్రగ్‌లార్డ్.[64]

మూలాలు

ఆధార గ్రంథాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ