కల్వకుంట్ల చంద్రశేఖరరావు

వికీపీడియా నుండి
(కేసీఆర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigationJump to search
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
అధికారిక చిత్రం (2017 ఏప్రిల్)
3వ తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
Incumbent
Assumed office
2023 డిసెంబరు 9
గవర్నర్తమిళిసై సౌందరరాజన్
ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి
అంతకు ముందు వారుఖాళీ
మల్లు భట్టివిక్రమార్క (2018-19)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు
Incumbent
Assumed office
2022 అక్టోబరు 5
వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్
అంతకు ముందు వారుకార్యాలయం ఏర్పాటు
1వ తెలంగాణ ముఖ్యమంత్రి
In office
2014 జూన్ 2 – 2023 డిసెంబరు 7[1]
గవర్నర్
Deputy
అంతకు ముందు వారుకార్యాలయం ఏర్పాటు
(నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి as ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్)
తరువాత వారురేవంత్ రెడ్డి[2]
తెలంగాణ శాసనసభ సభ్యుడు
Incumbent
Assumed office
2014 జూన్ 2
అంతకు ముందు వారుతూంకుంట నర్సారెడ్డి
నియోజకవర్గంగజ్వేల్ శాసనసభ నియోజకవర్గం
కార్మిక - ఉపాధి మంత్రిత్వ శాఖ (భారతదేశం)
In office
2004 నవంబరు 27 – 2006 ఆగస్టు 24
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుశిశ్ రామ్ ఓలా
తరువాత వారుమన్మోహన్ సింగ్
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ
In office
2004 మే 22 – 2004 మే 25
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుశత్రుఘ్న సిన్హా
తరువాత వారుటీఆర్ బాలు
లో‍క్‍సభ సభ్యుడు
In office
2009–2014
అంతకు ముందు వారుదేవరకొండ విఠల్ రావు
తరువాత వారుజితేందర్ రెడ్డి
నియోజకవర్గంమహబూబ్‌నగర్
In office
2004–2009
అంతకు ముందు వారుసి.హెచ్.విద్యాసాగర్ రావు
తరువాత వారుపొన్నం ప్రభాకర్
నియోజకవర్గంకరీంనగర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు
In office
2001 ఏప్రిల్ 27 – 2022 అక్టోబరు 5
వర్కంగ్ ప్రెసిడెంట్కేటీఆర్ (2018 డిసెంబరు 15 నుండి)
అంతకు ముందు వారుకార్యాలయం ఏర్పాటు
తరువాత వారుకార్యాలయం రద్దు
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్
In office
1999–2001
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్
అంతకు ముందు వారుఎన్. మహమ్మద్ ఫరూక్
తరువాత వారుకొప్పుల హరీశ్వర్ రెడ్డి
రవాణా మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
In office
1995 సెప్టెంబరు 1 – 1999 అక్టోబరు 11
గవర్నర్కృష్ణకాంత్
గోపాల రామానుజం
సి.రంగరాజన్
ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు
అంతకు ముందు వారుపి. చంద్రశేఖర్
తరువాత వారుఎలిమినేటి మాధవ రెడ్డి
కరువు & సహాయ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
In office
1987–1988
గవర్నర్కుముద్‌బెన్ జోషీ
ముఖ్యమంత్రిఎన్.టి. రామారావు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
1985–2004
అంతకు ముందు వారుఅనంతుల మదన్ మోహన్
తరువాత వారుతన్నీరు హరీశ్ రావు
నియోజకవర్గంసిద్దిపేట
వ్యక్తిగత వివరాలు
జననం (1954-02-17) 1954 ఫిబ్రవరి 17 (వయసు 70)
చింతమడక, సిద్ధిపేట జిల్లా,తెలంగాణ[3]
రాజకీయ పార్టీభారత రాష్ట్ర సమితి (Since 2001)
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్ (1980–1983)
తెలుగుదేశం (1983–2001)
జీవిత భాగస్వామిశోభ
సంతానంకేటీఆర్ (కుమారుడు)
కవిత (కుమార్తె)
బంధువులుహరీశ్‌రావు (మేనళ్లుడు)
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జ.1954 ఫిబ్రవరి 17) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.[4][5][6] ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు.[7] కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖర్ రావు 14వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు.[8] 2018  డిసెంబరు 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, డిసెంబరు 13  గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్‌ భవన్‌లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టాడు.[9]

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఎ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేశాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మొత్తం తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ముఖ్యపాత్ర పోషించాడు.

2014 జూన్‌ 2 నుండి 2023 డిసెంబరు 6 వరకు 9 సంవత్సరాల 187 రోజులపాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, స్వాతంత్య్రానికి పూర్వం నుండి 2023 వరకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరిన తెలుగు నాయకుడిగా రికార్డు సృష్టించాడు. ఒక తెలుగు నాయకుడు గ్యాప్‌ లేకుండా, ఏకబిగిన, ఇంత సుదీర్ఘ కాలం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి.[10]

జీవిత విశేషాలు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట (గ్రామీణ) మండలంలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. చంద్రశేఖర్ రావు కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు.[11][12] అతను సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసి,[11] ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివాడు.[13]

ఇతను 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలంగాణ రెండో అసెంబ్లీలో తెలంగాణ క్యాబినెట్‌లో (ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్)లో పనిచేశాడు, కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా పనిచేసి, ప్రస్తుతం నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలిగా పనిచేస్తున్నది. ఆయన మేనల్లుడు హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలంగాణ రెండో అసెంబ్లీలో తెలంగాణ క్యాబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. కేసీఆర్ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం కలవాడు.[14][15]

2015లో గృహ హింస నుండి రక్షించబడిన ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకున్నాడు. ఆమెకు 2020లో వివాహం జరిపించాడు.[16][17]

2023 డిసెంబరులో ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో తుంటి ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో చేరిన వారం రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యాడు.[18][19][20]

రాజకీయ జీవితం

తొలినాళ్ళ రాజకీయ జీవితం (1970-2001)

విద్యార్థి నేత, తొలినాళ్ళ రాజకీయాలు

విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది.[నోట్స్ 1] అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ ఇతనికి రాజకీయ గురువు. కేసీఆర్ మెదక్‌లో యువజన కాంగ్రెస్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.[21] 70వ దశకంలో యువజన కాంగ్రెస్  నాయకుడిగా పనిచేశాడు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ పక్షాన నిలిచాడు.[22] 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరాడు.[11]

వరుస విజయాలు, మంత్రి పదవులు

1985లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీచేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.[23] ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు.[11] 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1990లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు టీడీపీ కన్వీనర్‌గా నియమితులయ్యాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. 1997-98లో కేసీఆర్‌కు తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది.[24][25] 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి కూడా నిర్వహించాడు.[22] అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్‌ను అసంతృప్తుణ్ణి చేసింది.[11]

ఉద్యమ నాయకత్వం (2001-2014)

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన

ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి[26] 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో హైదరాబాద్‌లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు.[27][28] తెలంగాణ ప్రాంత ప్రజలు వివక్షకు గురవుతున్నారని, ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని విశ్వసిస్తున్నారని పేర్కొన్నాడు.[29] తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోడం,[30] విద్యుత్తు ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. మరోవైపు అప్రతిహతంగా అప్పటికి పదిహేనేళ్ళ పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్ధిపేటలో వరుసగా గెలుస్తూండడంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చాడు. తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు.[11][31]

అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది.[32] తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.[11]

2004 ఎన్నికలలో సిద్దిపేట శాసనసభ నియోజకగవరగం నుండి, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[33] తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానంతో ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది.[34][35] ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు.[36] 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా[21] పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ వ్యవహారం నచ్చకపోవడంతో మంత్రి పదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు.[37][38][39] ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[40] 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు.[41] జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు.[11] ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.

నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన

2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా భారత పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్ధిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలోని అలుగునూరు వద్ద పొలీసులు అరెస్టుచేసి ఖమ్మం పట్టణానికి తరలించారు [నోట్స్ 2] అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్‌ని తరలించారు.[42]

ఆయన నిరాహార దీక్ష ప్రారంభించి 11 రోజుల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పింది.[43]

2014 మే 16న కేసీఆర్ 19,391 మెజారిటీతో గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగానూ, 397,029 మెజారిటీతో మెదక్ నుండి ఎంపీగానూ ఎన్నికయ్యాడు.[44]

తెలంగాణలో 15 ఏళ్ళకు పైగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్‌ఎస్ 17 లోక్‌సభ స్థానాల్లో 11, 119 అసెంబ్లీ స్థానాల్లో 63 స్థానాల్లో విజయం సాధించి అత్యధిక ఓట్లను సాధించిన పార్టీగా అవతరించింది.[45]

జాతీయ రాజకీయాలు

2019 మే లో, 2019 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేసీఆర్ ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. భారత కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిని అధికారంలోకి తీసుకురావడమే ఫ్రంట్ లక్ష్యం.[46][47]

తెలంగాణ ముఖ్యమంత్రి (2014–2023)

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2014, జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసాడు. జ్యోతిష్యం, న్యూమరాలజీ, వాస్తుపై ప్రగాఢ విశ్వాసం ఉన్న కేసీఆర్, తన అదృష్ట సంఖ్య 'ఆరు'కి సరిపోయేలా పూజారుల సలహా మేరకు తన ప్రారంభోత్సవానికి మధ్యాహ్నం 12:57 (అంకెల మొత్తం ఆరు) గంటలకు నిర్ణయించాడు.[46] చంద్రశేఖర్ రావు 8 సార్లు టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[48] ఆయన తన నాలుగున్నర పాలన తరువాత 2018 సెప్టెంబరులో తెలంగాణ శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు.[49][50] ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.[51][52][53]

2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచిన తర్వాత చంద్రశేఖర్ రావు రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[54]

2014 నుంచి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సాంస్కృతికంగా ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దారు. కెసిఆర్ సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చాయి. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం పౌరుల సమాచారాన్ని చేరవేసేందుకు 2014 ఆగస్టు 19న ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా ఒక ఇంటెన్సివ్ ఇంటింటి సర్వే, సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. 94 పారామితులకు సంబంధించి సేకరించిన డేటా, రాష్ట్రంలోని ఒక కోటి నాలుగు లక్షల కుటుంబాలను కవర్ చేసింది.[55]

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలను కేసీఆర్ అభివృద్ధి చేశాడు. తెలంగాణ పండుగ బతుకమ్మను కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర పండుగగా ప్రకటించాడు.[56] 2017లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉర్దూను తెలంగాణ రెండో అధికార భాషగా ప్రకటించాడు.[57] కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం రూ. యాదాద్రి ఆలయ విస్తరణకు 1200 కోట్లు ఖర్చు పెట్టింది.[58]

సంక్షేమ పథకాలు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.[59][60][61][62]

కేసీఆర్ 2015 జనవరి 1న ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రారంభించాడు.[63][64] పేదలకు ఉచిత ఇళ్లను అందించడం కోసం కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించాడు. కళ్యాణలక్ష్మి - షాదీ ముబారక్ పథకం, నూతన వధూవరులకు సహాయం అందించడం కోసం ప్రారంభించాడు. రైతు బంధు పథకం, రైతులకు సహాయం అందించడం కోసం ప్రారంభించాడు.[62] ఆసరా పెన్షన్ పథకం, వృద్ధులందరికీ పెన్షన్లు అందించడం వంటి పథకాలను కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం ప్రారంభించింది.[65][66] 2021 ఆగస్టు 16న కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించాడు.[67]

పథకాలు - ఆవిష్కరణలు

  1. రైతుబంధు పథకం
  2. కె.సి.ఆర్‌. కిట్‌ పథకం
  3. ఆరోగ్య లక్ష్మి పథకం
  4. కళ్యాణలక్ష్మి పథకం
  5. షాదీ ముబారక్ పథకం
  6. చేనేత లక్ష్మి పథకం
  7. బతుకమ్మ చీరలు
  8. ఆసరా ఫింఛను పథకం
  9. గ్రామజ్యోతి పథకం
  10. పల్లె ప్రగతి పథకం
  11. హరితహారం
  12. ఫైబర్‌ గ్రిడ్‌ పథకం
  13. టి సాట్
  14. మన ఊరు - మన ప్రణాళిక
  15. మిషన్ కాకతీయ
  16. మిషన్ భగీరథ
  17. షాదీ ముబారక్ పథకం
  18. షి టీమ్స్
  19. టాస్క్
  20. టీ హబ్
  21. టీఎస్ ఐపాస్‌
  22. టీఎస్ బిపాస్‌
  23. వీ హబ్‌
  24. టీ యాప్ ఫోలియో
  25. టీ వాలెట్
  26. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై
  27. మన ఊరు - మన బడి
  28. అమరవీరుల స్మారకం
  29. హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు
  30. స్టేట్ ఇన్నోవేషన్ సెల్
  31. హాక్ఐ యాప్
  32. డయాగ్నస్టిక్ మొబైల్ యాప్
  33. క్రీడా ప్రాంగణం
  34. టీ వర్క్స్
  35. గ్రామీణ సంచార పశువైద్యశాల
  36. పల్లె ప్రకృతి వనం
  37. నేతన్న బీమా పథకం
  38. నేతన్నకు చేయూత పథకం
  39. కంటి వెలుగు
  40. రైతుబీమా పథకం
  41. అన్నపూర్ణ భోజన పథకం
  42. గృహలక్ష్మి పథకం
  43. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం
  44. ఆరోగ్య మహిళ
  45. దళితబంధు పథకం
  46. డబుల్ బెడ్రూమ్ పథకం
  47. కాళేశ్వరం ప్రాజెక్టు
  48. బస్తీ దవాఖాన
  49. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
  50. తెలంగాణ సచివాలయం
  51. గొర్రెల పంపిణీ పథకం
  52. రైతు వేదిక
  53. రైతు స‌మ‌న్వయ స‌మితి
  54. డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం
  55. బుద్ధవనం ప్రాజెక్టు
  56. పోడు పట్టాల పంపిణీ
  57. తొలిమెట్టు కార్యక్రమం

ముఖ్యమంత్రి పదవి తరువాత (2024–ప్రస్తుతం)

2023 డిసెంబరు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు. గజ్వేల్ నుంచి తన పార్టీకి చెందిన మాజీ సభ్యుడు ఈటెల రాజేందర్‌పై 45553 ఓట్లతో గెలుపొందాడు.[68] కామారెడ్డి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిద్దరూ బీజేపీకి చెందిన కేవీ రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.[69][70][71] ఆ ఎన్నిలకల్లో పార్టీ ఓడిపోయిన తరువాత 2023 డిసెంబరు 3న కేసీఆర్ తన రాజీనామాను సమర్పించాడు.

The Chief Minister of Telangana, Shri K. Chandrashekar Rao calling on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on December 26, 2018
2018లో ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ పిలుపు

2023 డిసెంబరు 16న తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించాడు.[72] ఇంతకుముందు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రావు 2024 ఏప్రిల్ 27న ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చేరాడు. తన పార్టీ 23వ వార్షికోత్సవం సందర్భంగా మరింత మందికి చేరువయ్యే ప్రయత్నం చేశాడు.[73][74] 2024 జూన్ లో, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వేడుకల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చేసిన ఆహ్వానాన్ని తిరస్కరించి, తన పార్టీ జరిపిన తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకల్లో పాల్గొన్నాడు.[75][76]

2024 భారత సార్వత్రిక ఎన్నికలలో, పార్టీ తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలలో పోటీ చేసినప్పటికీ, గత ఎన్నికలలో పార్టీ గెలిచిన 9 స్థానాలతో పోల్చితే ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.[77][78]

ఎన్నికలలో పోటీ

సంవత్సరంనియోజకవర్గంవిజేత పేరుపార్టీఓట్లుప్రత్యర్థి పేరుపార్టీఓట్లుమెజారిటీ
1983సిద్దిపేటఅనంతుల మదన్ మోహన్కాంగ్రెస్ పార్టీ28766కల్వకుంట్ల చంద్రశేఖరరావుస్వతంత్ర అభ్యర్థి27889- 877
1985సిద్దిపేటకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగుదేశం పార్టీ45215టి.మహేందర్ రెడ్డికాంగ్రెస్ పార్టీ2905916156
1989సిద్దిపేటకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగుదేశం పార్టీ53145అనంతుల మదన్ మోహన్కాంగ్రెస్ పార్టీ3932913126
1994సిద్దిపేటకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగుదేశం పార్టీ64645అనంతుల మదన్ మోహన్కాంగ్రెస్ పార్టీ3753827107
1999సిద్దిపేటకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగుదేశం పార్టీ69169మూషినం స్వామి చరణ్కాంగ్రెస్ పార్టీ4161427555
2004సిద్దిపేటకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి74287జిల్లా శ్రీనివాస్తెలుగుదేశం పార్టీ2916945118
2004కరీంనగర్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి451199చెన్నమననేని విద్యాసాగర్ రావుభారతీయ జనతా పార్టీ320031131168
2006 (ఉప ఎన్నికలు)కరీంనగర్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి378030టి.జీవన్ రెడ్డికాంగ్రెస్ పార్టీ176448210582
ఎల్.రమణతెలుగుదేశం పార్టీ170268
2008 (ఉప ఎన్నికలు)కరీంనగర్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి269452టి.జీవన్ రెడ్డికాంగ్రెస్ పార్టీ25368715765
2009మహబూబ్ నగర్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి366569దేవరకొండ విట్టల్ రావుకాంగ్రెస్ పార్టీ34638520184
కె.యాదగిరి రెడ్డిభారతీయ జనతా పార్టీ57955
2014గజ్వేల్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి86694వంటేరు ప్రతాప్ రెడ్డితెలుగుదేశం పార్టీ6730319391
2014మెదక్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి657492నరేంద్ర నాథ్కాంగ్రెస్ పార్టీ260463397029
2019గజ్వేల్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణ రాష్ట్ర సమితి125444వంటేరు ప్రతాప్ రెడ్డికాంగ్రెస్ పార్టీ6715458290
2023గజ్వేల్కల్వకుంట్ల చంద్రశేఖరరావుభారత రాష్ట్ర సమితి111,684ఈటెల రాజేందర్భారతీయ జనతా పార్టీ66,65345,031
కామారెడ్డికాటిపల్లి వెంకటరమణారెడ్డిభారతీయ జనతా పార్టీ66,652కల్వకుంట్ల చంద్రశేఖరరావుభారత రాష్ట్ర సమితి59,911-6,741

కాలరేఖ

కె. చంద్రశేఖర్ రావు 2004 నవంబరు 28న న్యూఢిల్లీలో కార్మిక - ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
  • 1985-2004: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (4 సార్లు)
  • 1987-88: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో సహాయ మంత్రి
  • 1992-93: అధ్యక్షుడు, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్స్
  • 1997-99: ఆంధ్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి
  • 1999-2001: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఉప సభాపతి
  • 2001 ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా
  • 2001 ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన
  • 2004: 14 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
  • 2004-06: కేంద్ర కార్మిక, ఉపాధి, రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రి
  • 2006 సెప్టెంబరు 23: లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
  • 2006 డిసెంబరు 7: 14 వ లోక్ సభ ఉప ఎన్నికలో మరల ఎన్నిక
  • 2008 మార్చి 3: లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
  • 2009: 15 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక (2వ సారి)
  • లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు
  • 2009 ఆగస్టు 31: కమిటీ ఆన్ ఎనర్జీలో సభ్యులు
  • 2009 సెప్టెంబరు 23: రూల్స్ కమిటీలో సభ్యులు
  • 2014: 16 వ లోక్ సభ సభ్యునిగా ఎన్నిక
  • 2014: గజ్వేల్ శాసనసభ్యునిగా ఎన్నిక [79]
  • 2014: తెలంగాణ రాష్ట్రం శాసన సభా పక్ష నాయకునిగా ఎన్నిక.
  • 2014, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
  • 2018: డిసెంబరు 13 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం
  • 2017లో హైదరాబాద్ మెట్రోలో ప్రధాని నరేంద్ర మోదీతో కె. చంద్రశేఖర్ రావు
    హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చిత్రం
    తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్

అవార్డులు

  • సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2014లో పాపులర్ ఛాయిస్ అవార్డు[80][81]
  • వ్యవసాయ నాయకత్వ పురస్కారం 2017[82][83]
  • ఎకనామిక్ టైమ్స్ అవార్డులు – 2018 సంవత్సరపు వ్యాపార సంస్కర్త[84]

సినీరచయితగా

కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2011లో విడుదలైన జై బోలో తెలంగాణ సినిమాలో "గారడి చేస్తుండ్రు" పాటను రాశాడు.[85] కొలిమి (2015) సినిమాలో ఒక పాట రాశాడు.[86] మిషన్ కాకతీయను ప్రచారం చేయడానికి, 2018 ఎన్నికల ప్రచారానికి పాటలకు సాహిత్యాన్ని కూడా అందించాడు.[87][88]

ఆస్తులు-కేసులు

  • 2023 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 58,93,31,800 రూపాయలు.[89]
  • తెలంగాణ ఉద్యమంకి సంబంధించినవి ఇతనిపై 9 కేసులు ఉన్నాయి.[89]

ఇతర వివరాలు

కేసీఆర్ గాంధేయవాది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన డిమాండ్లలో అహింసా విధానాన్ని అనుసరించేలా ప్రేరేపించినందుకు గాంధీయిజం, మహాత్మా గాంధీ బోధనలు, ఆలోచనలను ఆయన కీర్తించాడు.[90][91]

కేసీఆర్ రామానుజుల శ్రీ వైష్ణవుల అనుచరుడు, తన గురువైన చిన జీయర్ అమితమైన భక్తుడు. హిందూ మతం, ఆధ్యాత్మికతపై బలమైన విశ్వాసం కలవాడు.[92] ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు, యాదాద్రి, కొండగట్టు, వేములవాడతో సహా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమైన ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్ధరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టాడు.[93][94][95][96]

ఇవీ చూడండి

నోట్స్

మూలాలు

ఇతర లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వంశవృక్ష ఆధారం


మార్గదర్శకపు మెనూ